
అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల దాడులు
ఒంగోలు టౌన్: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఆదివారం పోలీసులు విస్తృతంగా దాడులు చేశారు. ఒంగోలు తాలూకా, సంతనూతలపాడు, సింగరాయకొండ, జరుగుమల్లి, మార్కాపురం, మర్రిపూడి, మార్కాపురం రూరల్, కనిగిరి పోలీసు స్టేషన్ల పరిధిలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి 55 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి 93,630 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సింగరాయకొండలో కోడిపందేలు ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1,27,800 స్వాధీనం చేసుకున్నారు. కొండప్రాంతాలు, పొలాల్లో పేకాట శిబిరాలను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి మరీ దాడులు నిర్వహించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 47 మందితో పాటు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 12 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా క్రాకర్స్ విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీలు చేశారు. జిల్లాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే వెంటనే 112, పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు సమాచారం తెలియజేయాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు కోరారు.
మార్కాపురం: మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి శనివారం సాయంత్రం తన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుండగా కోలభీమునిపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బోయలపల్లి పోలిరెడ్డి దూషించడంతోపాటు అధికారిక విధులను ఆటంక పరిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సైదుబాబు తెలిపారు.