
కొండపోరంబోకులు
గిద్దలూరు రూరల్:
గిద్దలూరు మున్సిపల్ పరిధిలోని కొండపోరంబోకు స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. అధికార టీడీపీ నేతలకు ప్రభుత్వ భూములు మేతగా మారుతున్నాయి. పట్టణంలోని హోసన్న మందిరం వైపు ఉండే కొండపోరంబోకు ప్రభుత్వ స్థలాలను టీడీపీ నాయకులు అధికారం బలంతో ఆక్రమించుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణను అరికట్టాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పట్టణంలోని రాజానగర్, నల్లబండబజారు, కొండపోరంబోకు స్థలాల్లో పెద్ద ఎత్తున లేఔట్లు వేసి పేద ప్రజల సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ఆ ప్రదేశాల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం అటు వైపు అడుగులు వేయకపోగా ఉన్న కొద్ది పాటి స్థలాలు ఆక్రమణలకు గురవుతుంటే చూస్తూ ఉండిపోయింది. హోసన్న మందిరం వైపు ఉన్న కొండపోరంబోకు స్థలాలు ఆక్రమణకు గురికాకుండా రెవెన్యూ శాఖ బోర్డు పెట్టింది. కొండపోరంబోకు స్థలాలు ఎవరూ కొనరాదు, అమ్మరాదు, ఇంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆ బోర్డులో పేర్కొన్నారు. ఈ ప్రకటన ఉల్లంఘించిన వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. చివరకు హెచ్చరిక బోర్డును ఆనుకుని కొన్ని అక్రమ నిర్మాణాలు జరిగాయి. హెచ్చరిక బోర్డుకు కూతవేటు దూరంలో ఇటీవల ఓ టీడీపీ నాయకుడు అధికారుల అండదండలతో సుమారు 20 స్లెంట్ల స్థలాన్ని పొక్లెయిన్‌తో చదును చేయించాడు. సదరు స్థలంలో రాతి కట్టడం కట్టాడు. ప్రభుత్వ స్థలాలు అప్పన్నంగా కాజేస్తున్నా వారి పేరు మీదు ఎలాంటి నోటీసులు లేదా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎటువంటి రాజకీయ అండదండలు లేని నిరుపేదలు ఆక్రమణలు జరిపిన వారికి మాత్రం నోటీసులు జారీ చేస్తూ కట్టడాలను అడ్డుకుంటున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న వారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.
ఏకంగా గృహాలే నిర్మాణం
పట్టణంలోని రాజానగర్, హోసన్న మందిరం, నల్లబండ బజారు, శ్రీరామ్‌నగర్, నరసింహాస్వామి మెట్లరోడ్డు వైపు ఉండే కొండపోరంబోకు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురై వందల సంఖ్యలో గృహ నిర్మాణాలు చేపట్టారు. ఆక్రమణకు పాల్పడిన వారి నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 225 జీఓ ప్రకారం వారి వద్ద ఉన్న ఆధారల మేరకు నగదు చెల్లించుకుని వారి అక్రమ కట్టడాలను రెగ్యులరైజేషన్ చేయాల్సి ఉంది. రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ దిశగా ఇప్పటి వరకు అడుగులు వేయలేదు. రాజానగర్, హోసన్న మందిరం, నల్లబండబజారు, శ్రీరామ్‌నగర్, నరసింహాస్వామి మెట్లరోడ్డు ప్రాంతాల్లోని కొండపోరంబోకు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు చేసి దర్జాగా నివశిస్తున్నా రెగ్యులరైజేషన్లు చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
గిద్దలూరు పట్టణంలో భూకబ్జాలు పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ
లేకుండాపోయింది. కొండపోరంబోకు స్థలాలపై అక్రమార్కుల కన్నుపడింది. ఖాళీ జాగా కనిపిస్తే క్షణాల్లో ఏదో ఒక కట్టడం కట్టేస్తున్నారు. అక్రమార్కులు ఇష్జారాజ్యంగా రెచ్చిపోతున్నా ఇదేందని అడిగే వారు లేకుండాపోయారు.
ఇటీవల ఓ టీడీపీ నాయకుడు
20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి
చదును చేయించినా రెవెన్యూ
అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.