
జవాన్ భూమి కబ్జాకు పచ్చనేతల పన్నాగం
యర్రగొండపాలెం: ఆర్మీ జవాన్‌కు దాదాపు 30 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమిని కబ్జా చేసేందుకు పచ్చనేతలు తహసీల్దార్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఆ భూమిని ఆన్‌లైన్ నుంచి తొలగించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం సర్వే నంబర్ 383లో దాదాపు 163.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 86.24 ఎకరాల భూమి సేద్యానికి ఉపయోగపడుతుందని అధికారులు గుర్తించి 2008 అక్టోబర్ 30న పేదలకు భూమిని పంపిణీ చేశారు. అందులో భాగంగా దూదేకుల తంగెళ్ల ఖాశిం 4.70 ఎకరాలు, ఆయన సోదరుడు దూదేకుల ఖాశింకు 3 ఎకరాలు చొప్పున ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. అప్పటి నుంచి వారు ఆ భూమిలో వివిధ పంటలు పండించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వారిలో తంగెళ్ల ఖాశిం ఆర్మీ జవాన్‌గా, ఖాశిం హైదరాబాద్‌లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కె.ఏడుకొండలు, ఆర్.చిన్నతిరుపాలు ఆ భూములపై కన్నేశారు. 2020లో వారికి ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలపై కొండవాగు పోరంబోకు భూమి అని అభ్యంతరం తెలిపారు. దీనిపై అప్పటి తహసీల్దార్ దర్యాప్తు జరిపి వారికి భూమిని స్వాధీనం చేశారు. తమకు, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ సోదరులు ఇద్దరు ఎస్పీకి అర్జీ పెట్టుకున్నారు. అప్పటి తహసీల్దార్ కూడా వారి కుటుంబంతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన భూమికి రక్షణ కల్పించాలని త్రిపురాంతకం పోలీస్‌స్టేషన్‌కు లెటర్ పెట్టారు. ఈ విషయంపై పోలీసులు వారిని పిలిపించి హెచ్చరించడంతో వారు మిన్నకుండిపోయారని ఆర్మీ జవాన్ తెలిపాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్య మొదటికి వచ్చింది. ఆ భూమిపై కన్నేసిన ఏడుకొండలు, చిన్న తిరుపాలు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అండదండలతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ చీరాల కృష్ణమోహన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి ఆన్‌లైన్‌లో వారి భూములను తొలగింప చేశారు. అంతేకాకుండా ఆర్మీ జవాన్ తండ్రి దూదేకుల జానయ్యపై దాడి చేయించారు. ఈ విషయంపై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టినప్పటికీ నిందితులపై ఎటువంటి చర్య తీసుకోలేదని, కనీసం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మందలించక పోవడంతో వారు మరింతగా రెచ్చిపోయి పొలానికి రక్షణగా వేసుకున్న కంచెను, విద్యుత్ బోరు పరికరాలను ధ్వంసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వర్గీయులు చేస్తున్న దౌర్జన్యాలపై ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని, ఆయనకు ఇచ్చిన అర్జీని దర్శి డీవైఎస్పీకి పంపారని తెలిపారు. ఎస్పీ ఫార్వర్డ్ చేసిన అర్జీపై డీవైఎస్పీ మాట్లాడుతూ ఇది సివిల్ కేసని, కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారని చెప్పారు.
సమగ్ర దర్యాప్తు జరపకుండా
ఆన్‌లైన్ తొలగింపు
టీడీపీ వర్గానికి చెందిన వారు చేసిన ఫిర్యాదు మేరకు ఎటువంటి విచారణ జరపకుండా తమ భూమిని తహసీల్దార్ ఆన్‌లైన్ నుంచి తొలగించారని బాధితులు ఆరోపించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏడుకొండలు అతని అనుచరులు తాము అనుభవిస్తున్న భూమిపై అర్జీలు ఇవ్వడం వారితో చీవాట్లు పెట్టించుకోవడం అలవాటైపోయిందని, అధికారం ఉందన్న అహంకారంతో తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టి వారం రోజులు కాకముందే పచ్చ నేతలు హాజరు కావడం, అర్జీ ఇవ్వడం, ఆన్‌లైన్ నుంచి ఆర్మి జవాన్ అతని సోదరుడి భూమిని తొలగించడం యుద్ధప్రాతిపదికగా జరిగి పోయాయని ఆ గ్రామస్తులు ఆరోపించారు. విచారణ జరపకుండా ఆన్‌లైన్ నుంచి భూమిని ఏ విధంగా తొలగించావని కలెక్టర్ తహసీల్దార్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. అధికార వర్గీయుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉండటం వలన తాను వారి భూమిని ఆన్‌లైన్ నుంచి తొలగించాల్సి వచ్చిందని తహసీల్దార్ కృష్ణమోహన్ సమాధానం తెలిపినట్లు తెలిసింది.
ఆ భూమిపై కన్నేసి..
డబ్బులు దండుకొని
ఆర్మీ సోదరుల భూమిపై కన్నేసిన పచ్చ గద్దలు అర ఎకరం ప్రకారం తమ పేర్లతో ఆన్‌లైన్ చేయిస్తానని 10 మంది నుంచి డబ్బులు వసూలు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకోసం ఆ గద్దలు భూమిపై హక్కుపొందిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వాగు పోరంబోకు భూమి అని సాకులు చూపుతున్న రెవెన్యూ అధికారులు ఆ సర్వే నంబర్‌లో పంపిణీ చేసిన 86.24 ఎకరాల భూమిని పక్కనపెట్టి కేవలం 7.70 ఎకరాలపైనే దృష్టి పెట్టి పచ్చ గద్దలకు ఆహారంగా వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకొని దేశరక్షణ కోసం పాటు పడుతున్న ఆర్మీ జవాన్, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.
భూ పత్రాలు చూపినా ఆన్‌లైన్ నుంచి తొలగింపు
పట్టాదారు తండ్రిపై దాడి చేసినా పట్టించుకోని పోలీసులు
దౌర్జన్యంగా పొలం ఫెన్సింగ్
తొలగింపు, బోరు ధ్వంసం
కలెక్టర్, ఎస్పీలను ఆశ్రయించిన బాధితులు

జవాన్ భూమి కబ్జాకు పచ్చనేతల పన్నాగం