
రేషన్ బియ్యంపై నిరంతరం నిఘా
నాగులుప్పలపాడు: రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. బాపట్ల నుంచి కృష్ణపట్నం పోర్టుకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ స్థానిక పోలీసులకు పట్టుబడిన బియ్యాన్ని శనివారం ఎన్‌ఫోర్సుమెంట్ డిప్యూటీ తహసీల్దార్‌లు నాగులుప్పలపాడు పోలీస్‌స్టేషన్‌లో పరిశీలించారు. 720 బ్యాగుల్లో ఉన్న బియ్యాన్ని ఒంగోలు స్టాక్ కేంద్రానికి తరలించారు. అనంతరం మద్దిపాడు మండలంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లును పరిశీలించారు. అక్కడ ఎలాంటి పీడీఎస్ రైస్ లేవని స్పష్టం చేశారు.
మద్దిపాడు: మండలంలోని గుండ్లపల్లి గ్రోత్ సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఎస్సై వెంకట సూర్య అందించిన సమాచారం ప్రకారం.. తిమ్మనపాలెం గ్రామానికి చెందిన అన్నంగి కుమార్ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రోత్ సెంటర్ వైపు నుంచి నాగులుప్పలపాడు రోడ్డుకు వెళ్తుండగా ఒంగోలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఒంగోలు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఒంగోలు వన్‌టౌన్: ఏసీ, రిఫ్రిజిరేటర్ మరమ్మతులపై ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఒంగోలు రూడ్‌సెట్ సంస్థ డైరక్టర్ పీ శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకూ 30 రోజుల పాటూ ఈ ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు 18 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు ఉండాలన్నారు. అభ్యర్థులు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. శిక్షణ కాలంలో పూర్తి ఉచిత, భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు 9573363141 అనే నంబరుపై సంప్రదించాలన్నారు.
కందుకూరు రూరల్: ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఓగూరు సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఒంగోలుకు చెందిన పి.భార్గవ్‌నాథ్ కొరియర్ బాయ్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై కందుకూరు వచ్చి విధులు ముగించుకొని తిరిగి ఒంగోలు వెళ్తున్నాడు. ఓగూరు సమీపంలోని రవి గార్డెన్ వద్దకు వెళ్లగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ నాన్ స్టాప్ బస్ ఢీకొట్టింది. భార్గవ్‌నాథ్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కందుకూరు రూరల్ ఎస్సై మహేంద్ర నాయక్ తెలిపారు.

రేషన్ బియ్యంపై నిరంతరం నిఘా

రేషన్ బియ్యంపై నిరంతరం నిఘా