
గంజాయి ప్రియులకు కౌన్సెలింగ్
ఒంగోలు టౌన్: గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 46 మందికి, 9 మంది విక్రేతలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. శనివారం గంజాయి వినియోగిస్తున్న మామిడిపాలెం, కేశవరాజుకుంట, కమ్మపాలెం, ఇందిరమ్మ కాలనీ, గోపాల్ నగర్, మంగమూరు రోడ్డు, భారత్ కాలనీ, నెహ్రూ నగర్, వెంకటేశ్వర కాలనీ, త్రోవగుంట, దిబ్బల రోడ్డు ప్రాంతాలకు చెందిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి విక్రయిస్తున్న మామిడిపాలెం, శివప్రసాద్ కాలనీ, గాంధీనగర్, మదర్‌థెరిసా కాలనీ, పేర్నమిట్ట, వెంకటేశ్వరకాలనీ, ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని ప్రాంతాలకు చెందిన వారికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వివరించి చెప్పారు. చట్టపరంగా ఎదురయ్యే కష్టనష్టాలను, దాని వలన కలిగే సామాజిక ప్రభావాన్ని వివరించారు. గంజాయి కట్టడికి ప్రజలు సహకరించాలని, ఏదైనా సమాచారం ఉంటే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.