దోపిడీ బండ | - | Sakshi
Sakshi News home page

దోపిడీ బండ

Oct 5 2025 2:12 AM | Updated on Oct 5 2025 2:12 AM

దోపిడ

దోపిడీ బండ

ప్రభుత్వం పెంచిన రూ.35 వేలతో పాటు అనధికారికంగా మరో రూ.35 వేలు చెల్లించాలని రుబాబు పెత్తనం ఇస్తారా..? ఇవ్వరా అంటూ గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులపై బహిరంగంగా ఒత్తిడి అన్నీ తెలిసినా కనీసం నోరు మెదపని జిల్లా భూగర్భ గనుల శాఖాధికారులు గ్రానైట్‌ పరిశ్రమపై ప్రైవేటు దోపిడీ ఏంటంటూ ఆవేదన ఇప్పటికే నాలుగో రోజుకు చేరుకున్న ఫ్యాక్టరీల బంద్‌ ఈ నెల 9వ తేదీకి చర్చలు వాయిదా

బాహాటంగా

చీమకుర్తి:

గ్రానైట్‌పై సీనరేజి వసూలు బాధ్యతలను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడాన్ని నిరశిస్తూ గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులు చేపట్టిన బంద్‌ కొనసాగుతోంది. ప్రైవేటు సంస్థకు, గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులకు మధ్య జరిగిన చర్చల్లో సదరు ప్రైవేటు సంస్థ బహిరంగంగానే అదనపు వసూళ్లకు పట్టుబడుతూ గ్రానైట్‌ యజమానులపై ఒత్తిడి తేవడంతో చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న గ్రానైట్‌ పరిశ్రమలో ప్రభుత్వం ఒక్కో బ్లేడ్‌కు అదనంగా మైనింగ్‌ బిల్లుకు రూ.8 వేలు పెంచింది. దాని వలన ఇప్పటి వరకు శ్లాబ్‌ విధానంలో ఒక్కో బ్లేడ్‌కు చెల్లించే రూ.27 వేలకు అదనంగా మరో రూ.8 వేలు పెంచటంతో మొత్తం కలిసి రూ.35 వేలు అయింది. దానికి జీఎస్‌టీ, ఇతర ఖర్చులు కలిపితే మొత్తం రూ.40 వేలకు చేరుకుంటుంది. ఒక్కో గ్రానైట్‌ ఫ్యాక్టరీలో కనీసం రెండు బ్లేడ్‌లు నుంచి మూడు, నాలుగు, మల్టీ సంఖ్యలో బ్లేడ్‌లు ఉంటాయి. ఎన్ని బ్లేడ్‌లు ఉంటే అన్ని రూ.35 వేలు చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు శ్లాబ్‌ విధానంలో చెల్లించే బిల్లులను ప్రభుత్వం ప్రైవేటు కంపెనీకి అప్పగించటంతో ఈ బిల్లులను ప్రైవేటు కంపెనీకి చెల్లించాలి. అయితే ప్రైవేటు కంపెనీ వారు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఒక్కో బ్లేడ్‌కు రూ.35 వేలతో పాటు కంపెనీకి అనధికారకంగా మరో రూ.35 వేలు చెల్లించాలని బాహాటంగా చర్చల్లో పెట్టి నిలువు దోపిడీకి తెరలేపింది. దానిపై శనివారం ఒంగోలులోని గ్రానైట్‌ క్వారీల యజమానుల అతిథి గృహంలో ప్రైవేటు కంపెనీకి, చీమకుర్తిలోని గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులకు మధ్య జరిగిన చర్చల్లో ప్రైవేటు రుబాబు వసూళ్ల వద్దే ఫ్యాక్టరీల యజమానులు అడ్డం తిరిగారు. భారమైనా ప్రభుత్వం చెల్లించమన్న రూ.35 వేలను ఒక్కో బ్లేడ్‌కు చెల్లిస్తాం.. అంతే గానీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రైవేటు కంపెనీ రుబాబు చేసి అనధికారికంగా చెల్లించమన్న రూ.35 వేలను కట్టే ప్రసక్తే లేదని తెగేసి చెప్పటంతో ప్రైవేటు కంపెనీ వారు తమ ఉన్నత స్థాయి ప్రతినిధులతో మాట్లాడి ఈనెల 9వ తేదీ లోపు చెప్తామంటూ చర్చలను అసంతృప్తిగా ముగించారు.

ముడిరాయి, వేస్ట్‌ రాళ్లపై కూడా ప్రైవేటు కంపెనీ బాదుడు:

గ్రానైట్‌ క్వారీలో నుంచి ఫ్యాక్టరీల యజమానులు కొనుగోలు చేసే ముడిరాళ్లు అన్నీ ప్రాసెస్‌ చేసే సమయానికి వేస్ట్‌, క్రాక్‌లు, సక్రమ సైజులు లేకపోవడం వలన కొనుగోలు చేసిన రాళ్లల్లో దాదాపు 20–25 శాతం రాయి వృథాగా పోతోంది. కానీ క్వారీ నుంచి కొనుగోలు చేసిన రాయి బయటకు వచ్చే సమయంలో సీనరేజి వసూళ్లకు వచ్చిన ప్రైవేటు కంపెనీ మాత్రం వేస్ట్‌గా పోయే రాళ్లతో సహా రాయల్టీని చెల్లించాల్సి ఉంటుందని ఫ్యాక్టరీల యజమానులపై ఇప్పుడే ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఫ్యాక్టరీల యజమానులు మాత్రం ఫినిష్డ్‌ చేసిన మెటీరియల్‌పై మాత్రమే రాయల్టీ చెల్లిస్తామంటున్నారు. ఇలా రాయల్టీ, శ్లాబ్‌ విధానంలో మైనింగ్‌ బిల్లులు చెల్లించలేక ఫ్యాక్టరీల యజమానులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి నెలసరి వాయిదాలు, కరెంటు బిల్లులు చెల్లించలేక ఇబ్బంది పడుతుంటే వాటితో పాటు అనధికారకంగా ఒక్కో బ్లేడ్‌కు రూ.35 వేలు చెల్లిస్తారా..? లేక చెల్లించరా ? అంటూ ఫ్యాక్టరీల యజమానులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీల మూసివేత ఎప్పటి వరకు ఉంటుందో... వారి మధ్య సయోధ్య ఎప్పటికి కుదురుతుందోనని ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఫ్యాక్టరీల యజమానులకు గ్రానైట్‌ రాళ్లను రవాణా చేసే ట్రాలీలు, లారీల యజమానులు సంఘీభావం ప్రకటించి తమ మద్దతు తెలిపారు.

మర్రిచెట్లపాలెంలోని గ్రానైట్‌ ఫ్యాక్టరీలో గ్రానైట్‌ బ్లాకులను కట్‌ చేస్తున్న బ్లేడ్‌

రుబాబు వసూళ్లపై నోరు మెదపని మైన్స్‌ అధికారులు

ప్రైవేటు కంపెనీ నిర్వాహకులు నిస్సిగ్గుగా గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులను అనధికారికంగా రూ.35 వేలు చెల్లించాలని బహిరంగంగా చర్చలు పెట్టి మరీ మేము అడిగినంత ఇస్తారా..? లేదా..? డిమాండ్‌ చేస్తుంటే జిల్లా మైన్స్‌ అధికారులు నోరు మెదపకపోవడం శోచనీయమని ఫ్యాక్టరీల యజమానులు వాపోతున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రైవేటు కంపెనీ వారి వసూళ్లలో వీరి పాపం కూడా ఉందేమోనని ఫ్యాక్టరీల యజమానులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

దోపిడీ బండ1
1/1

దోపిడీ బండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement