
పత్తిపై విద్వేష కత్తి
టీడీపీ నాయకుల దౌర్జన్యం 6.39 ఎకరాల్లో పత్తి పంటను దున్నేసిన వైనం కోర్టు ఇంజెక్షన్ ఉత్తర్వులు ఉన్నా బేఖాతర్ బాధితుల ఆందోళన
దొనకొండ: కోర్టు ఇంజెక్షన్ ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా, కాపు దశలో ఉన్న 6.39 ఎకరాల పత్తి పొలాన్ని విద్వేషంతో దున్నేసిన టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ ఇది. దొనకొండ మండలం వద్దిపాడు గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన తొలుచూరి చిన్నయ్య సర్వే నంబర్ 174లో తను కొనుగోలు చేసిన 7.80 ఎకరాలను కుమారుడు కోటయ్యకు అలాగే అల్లుడు గుమ్మా కొండయ్యకు సమానంగా 1992లో జాయింట్ రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో పాటు సర్వే నంబర్ 166/2లో 1.66 ఎకరాలు, 158/2లో 0.83 ఎకరాలు అల్లుడు కొండయ్యకు రిజిస్ట్రేషన్ చేశారు. తద్వారా మొత్తం 6.39 ఎకరాలు కొండయ్యకు దఖలుపడింది. అప్పటి నుంచి వీరు భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
మోసంతో రిజిస్ట్రేషన్...
కాగా, కొద్ది సంవత్సరాల క్రితం కొండయ్య మతి స్థిమితం తప్పింది. దీనిని ఆసరాగా చేసుకుని కొండయ్యకు చెందిన 6.39 ఎకరాలను గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తాడి నారాయణరెడ్డి తన బినామీ తోట వెంకట రమణ పేరున 2022 మేలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ తరువాత కొద్ది నెలలకే కొండయ్య మృతి చెందడంతో ఈ మొత్తం వ్యవహారంపై తొలుచూరి కోటయ్య, ఆయన సోదరి, గుమ్మా కొండయ్య భార్య పెద్ద కోటమ్మ అదే ఏడాది సెప్టెంబర్‌లో దర్శి జూనియర్ కోర్టులో ఇంజెక్షన్ దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు వీరికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. నేటికీ ఆ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. ఈ ఉత్తర్వుల మేరకు నాటి తహసీల్దార్ కె.వెంకటేశ్వరరావు ఈ భూమిని‘డిస్ప్యూట్’ పెట్టారు.
కోర్టు కేసుల్లో ఉన్న పొలం ‘తిరిగి’ రిజిస్ట్రేషన్
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతోనే సదరు టీడీపీ నాయకుడు నారాయణరెడ్డి తహసీల్దార్‌తో లాలూచీ పడి ఈ ఏడాది ఏప్రిల్ 24న భూమిని ‘డిస్ప్యూట్’ నుంచి తొలగించారు. అదే నెలలో ఈ భూమిని తోట వెంకట రమణచేత నారాయణరెడ్డి తన కుమారుడు తాడి శేఖర్‌రెడ్డిపై తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు. కోర్టులో పొలం వ్యాజ్యం ఉండగా, ఈ రిజిస్ట్రేషన్ అన్యాయమని పేర్కొంటూ కోటమ్మ ఈ వ్యవహారాన్ని ఆగస్టులో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో ఈ వ్యాజ్యాన్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు. కాగా, కొద్ది నెలల క్రితం కోటమ్మ తమ ఆధీనంలో ఉన్న మొత్తం 6.39 ఎకరాల్లో రూ.లక్షలు ఖర్చుచేసి పత్తి పంట వేసింది. పొలం మొత్తం కాపు దశలో ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు నారాయణరెడ్డి, ఆయన అనుచరులు శనివారం తెల్లవారుజామున భూమిని ట్రాక్టర్‌తో దున్నేశారు. ఉదయం 6 గంటలకు ఈ దారుణాన్ని తెలుసుకున్న బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
దున్నడం తప్పే:
ఈ ఘటనపై తహసీల్దార్ బి.రమాదేవిని వివరణ కోరగా.. రైతు సాగు చేసిన పొలాన్ని అన్యాక్రాంతంగా వేరే వారు దున్నటం తప్పని పేర్కొన్నారు. ఆటో మ్యుటేషన్ కారణంతో రెండవదఫా రిజిస్ట్రేషన్ జరిగి ఉండవచ్చని తెలిపారు.
– తహసీల్దార్
త్రిపురాంతకం సీఐ బెదిరించారు
ఈ వ్యవహారంపై నన్ను త్రిపురాంతకం సీఐ హసన్ పిలిపించి పొలం నుంచి వైదొలగకపోతే క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరించారు.
– తొలుచూరి కోటయ్య, వద్దిపాడు
నా భర్తకు మతి స్థిమితం లేదు
నా భర్త కొండయ్యకు మతి స్థిమితంలేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని మా కుటుంబ సభ్యులకు తెలియకుండా నా భర్తతో నారాయణరెడ్డి తన బినామీ వెంకటరమణకు రిజిస్ట్రేషన్ చేయించాడు. మా భూమికి సంబంధించి జరిగిన రిజిస్ట్రేషన్లు దారుణం.
– గుమ్మా పెద్ద కోటమ్మ, వద్దిపాడు