
కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు పెట్టండి
ఒంగోలు టౌన్: కులగణన చేపట్టిన తరువాతనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, కులాల జనాభా ప్రతిపాదికన స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో శనివారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కులగణన చేపట్టాన్న డిమాండ్‌తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జనగణనతో పాటుగా కులగణన చేపట్టాలని, కులాల జనాభా ప్రతిపాదికన వారికి దక్కాల్సిన హక్కులు కేటాయించాలని కోరారు. బీసీలలో 143 కులాలు ఉన్నా వాటిలో ఎక్కువ భాగం కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల కంటే హీనమైన జీవితాలను అనుభవిస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వారికి సక్రమంగా దక్కడం లేదని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా ఎన్‌ఆర్‌సీ తీసుకొచ్చిందని చెప్పారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కులగణన ప్రతిపాదికన రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం వలన ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కోల్పోయిన యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోవున్న పార్టీలు ప్రజలను కులమతాలుగా విడగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు తన్నీరు శివప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజలు ఐక్య పోరాటాల ద్వారానే తమ హక్కులను సాధించుకోవాలని చెప్పారు. కులగణన చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు ఆచరణలో వెనేకంబ వేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా ముందుకు వచ్చి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మొండిబండ కులసంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గంగిరెడ్డు, బుడబుక్కల, కాటికాపరులు, పాముకులస్తులు బీసీ కులాల జాబితాలో ఉన్నా ఎస్సీ, ఎస్టీల కంటే హీనంగా బతుకుతున్నారని చెప్పారు. పోరాటాల ద్వారానే కులగణన సాధ్యమవుతుందని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు సయ్యద్ యాసిన్, కృష్ణ గౌడ్, యం.విజయ, ఖాసీం, బేగ్, ఎల్.రాజశేఖర్, పి.సుధాకర్, పేరయ్య, సుబ్బారావు, ఆర్.వెంకటరావు, కవరది సుబ్బారావు, వీరారెడ్డి, మురళి, డి.శ్రీనివాస్, మౌలాలి, లక్ష్మీ, రామయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు.