
పొగాకు రైతులను ఆదుకోవాలి
ఒంగోలు టౌన్: రైతుల వద్ద ఇంకా 30 శాతం బర్లీ పొగాకు మిగిలిపోయిందని, రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ.కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో శనివారం నిర్వహించిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని, వర్జీనియా పొగాకు లో గ్రేడ్ రకాన్ని రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం తగినంత మేర నిధులు కేటాయించి పొగాకును కొనుగోలు చేయకపోతే రైతులు కోలుకోని విధంగా నష్టపోతారని చెప్పారు. ఇటీవల వర్జీనియా నంబర్ పొగాకుకు కాస్త రేటు వచ్చినప్పటికీ అది తాత్కాలికంగా కొనుగోలు చేశారని, తిరిగి మాములు పరిస్థితి నెలకొందని చెప్పారు. లో గ్రేడ్ పొగాకు రేట్లు బాగా పతనమయ్యాయన్నారు. దీని వలన బ్యారన్‌కు రూ.5 లక్షల వరకు నష్టపోతున్నారని తెలిపారు. కోల్డ్ స్టోరేజీలో శనగలను దాచి పెట్టుకున్నా సరైన ధరలు రాక రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారన్నారు. శనగలు క్వింటాకు రూ.10 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రిజర్వ్ బ్యాంకు రూ.234 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి జమ చేసినా రైతుల రుణమాఫీ గురించి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు మాట్లాడుతూశనగలు రూ.10 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 6వ తేదీ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయంతిబాబు అధ్యక్షత వహించగా పెంట్యాల హనుమంతరావు, ఏడుకొండలు, అబ్బూరి వెంకటేశ్వర్లు, రత్నారెడ్డి, గంగినేని సత్యనారాయణ, కరిచేటి హనుమంతరావు, బెజవాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.