
డీపీవో ఉద్యోగులు సమయపాలన పాటించాలి
● ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయం (డీపీవో) ఉద్యోగులు సమయపాలన పాటించాలని, ఫైల్స్ పెండింగ్ లేకుండా సకాలంలో పనులు పూర్తిచేయాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు ఆదేశించారు. బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, పనులు వాయిదా వేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివి తన దృష్టికి వస్తే తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ, డీటీఆర్బీ, పరిపాలనా విభాగంలోని అన్ని సెక్షన్లు, అడిషనల్ ఎస్పీ కార్యాలయాలను పరిశీలించారు. సంబంధిత అధికారుల నుంచి ఆయా విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించిన ఎస్పీ.. వాటిని క్రమబద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్ విధుల గురించి ఆరా తీశారు. వారి పనితీరుపై సమీక్షించి సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు పలు సలహాలు, సూచనలు చేశారు. వివిధ కమిషన్ల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి నిర్ణీత కాలంలో సమాధానాలు పంపించాలని చెప్పారు. ఎస్పీ వెంట డీపీవో ఏవో రామ్మోహన్‌రావు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఆర్‌ఐ సీతారామిరెడ్డి ఉన్నారు.
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా నాయకులను పార్టీలోని వివిధ పదవుల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) మెంబర్లుగా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన జంకె వెంకటరెడ్డి, కనిగిరి నియోజకవర్గానికి చెందిన చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి, కొండపి నియోజకవర్గానికి చెందిన మాదాసి వెంకయ్యని నియమించారు. అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్‌ఈసీ) మెంబర్లుగా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, కొండపి నియోజకవర్గానికి చెందిన బత్తుల అశోక్‌రెడ్డి, గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన పిడతల ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నియమించారు.
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు (జనరల్, ఒకేషనల్)కు పబ్లిక్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 2026 మార్చి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ కె.ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ వాళ్లకు 2026 ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు, ఒకేషనల్ వాళ్లకు 2026 జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెక్షన్లలో జరుగుతాయని తెలిపారు. సమగ్రశిక్ష ఒకేషనల్ ట్రేడ్ ఎగ్జామ్ 13–02–2026న జరుగుతుందన్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ జనవరి 21వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జాం జనవరి 23 ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు జరుగుతుందని తెలిపారు.
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్...
ఫిబ్రవరి 23న తెలుగు/సంస్కృతం/ఉర్దూ/హిందీ/తమిళ్/ఒరియా/కన్నడ/అరబిక్/ఫ్రెంచ్, 25న ఇంగ్లిష్, 27న హిస్టరీ, మార్చి 2న మ్యాథ్స్, 5న బయాలజీ, 7న ఎకనామిక్స్, 10న ఫిజిక్స్, 12న కామర్స్, 14న సివిక్స్, 17న కెమిస్ట్రీ, 20న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, 24న మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫి పరీక్షలు జరుగుతాయి.
ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్...
ఫిబ్రవరి 24న తెలుగు, 26న ఇంగ్లిష్, 28న బోటనీ/హిస్టరీ, మార్చి 3న మ్యాథ్స్ 2ఏ/సివిక్స్ 2, 6న జువాలజీ–2/ఎకనామిక్స్–2, 9న మ్యాథ్స్ 2బీ, 11న కామర్స్–2/సోషియాలజీ–2/ఫైన్ ఆర్ట్స్/మ్యూజిక్, 13న ఫిజిక్స్–2, 16న మోడరన్ లాంగ్వేజ్/జాగ్రఫీ, 18న కెమిస్ట్రీ–2, 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్ పరీక్షలు జరుగుతాయి. సెకండియర్ పరీక్షలు పాత సిలబస్ ప్రకారం జరుగుతాయని, అదేవిధంగా విద్యార్థులకు ఫస్టియర్ సబ్జెక్ట్‌లు పెండింగ్ ఉంటే కూడా పాత సిలబస్ ప్రకారమే జరుగుతాయని తెలిపారు.