
ఎయిడెడ్ స్కూళ్లకు సీఆర్పీలను కేటాయించాలి
● ఏపీ టీచ ర్స్ గిల్డ్ జిల్లా నేతల
డిమాండ్
ఒంగోలు సిటీ: జిల్లా పరిధిలోని 39 ఎయిడెడ్ ఏకోపాధ్యాయ పాఠశాలలకు సీఆర్పీలను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.వెంకట్రావు, సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెళ్లూరు, కొప్పోలు, ఒంగోలు, కొత్తపల్లి, బసవన్నపాలెం, మద్దిరాలపాడు, పోతవరం, అమ్మనబ్రోలు, తిమ్మసముద్రం, ఉప్పుగుండూరు, చెరుకూరు, ఇడుపులపాడు, మార్టూరు, రాజుపాలెం, అద్దంకి, చీమకుర్తి, రాజుపాలెం, రావిపాడు, కంభం,తిరుమలాపురం, గిద్దలూరు, బెస్తవారిపేట, కనిగిరి, గుడిపాటి పల్లి, కరేడు ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క టీచరే 1 నుంచి 5వ తరగతి, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 వ తరగతి వరకు బోధిస్తున్నారని వివరించారు. టీచర్లు సెలవు పెట్టినప్పుడు సీఆర్పీలను పంపాల్సి ఉండగా కొందరు విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటరీ టీచర్‌ను నియమించుకుని సెలవు పెట్టుకోవాలని ఎంఈఓలు సూచించడాన్ని తప్పుబట్టారు. జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి ఏకోపాధ్యాయ పాఠశాలలకు శాశ్వత సీఆర్పీలను కేటాయించాలని కోరారు.
● ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్
ఒంగోలు సబర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రజలకు అందాలని ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. వినియోగదారులకు కలిగే మేలుపై అవగాహన కల్పించడానికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సదస్సుకు దినకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్‌టీ సంస్కరణలను సక్రమంగా అమలు చేసి ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సేవలు న్యాయమైన ధరకు అందేలా పర్యవేక్షించాలని వినియోగదారుల కమిషన్ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ సత్య ప్రకాశ్, డీఆర్‌ఓ ఓబులేసు, ఒంగోలు చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువాయి కుమార్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దేవతు శ్రీరాములు, ఎస్టీపీ అసోసియేషన్ అధ్యక్షుడు రోశయ్య పాల్గొన్నారు.