
ఎన్‌సీడీసీ రుణాల మంజూరులో భారీ అవినీతి
ఒంగోలు సబర్బన్: నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌సీడీసీ) రుణాల మంజూరులో అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఎన్.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల పెంపకందారుల జిల్లా సహకార యూనియన్ ద్వారా ఇచ్చిన ఎన్‌సీడీసీ రుణాల్లో అవినీతిని నిగ్గు తేల్చి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా యూనియన్ ద్వారా 2014 నుంచి 2021 వరకు గొర్రెల పెంపకందారుల అభివృద్ధి కోసం మూడు దఫాలుగా రూ.20 కోట్ల రుణాలు సుమారు 1000 మందికి ఇచ్చారన్నారు. అయితే అప్పటి పాలకవర్గం, అధికారులు కుమ్మకై ్క నిబంధనలకు విరుద్ధంగా రుణాలు పంపిణీ చేశారని ఆరోపించారు. ఆడిట్ అధికారులు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి రుణాల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు నివేదిక ఇచ్చారన్నారు. దీనినిబట్టి రుణాల మంజూరు సమయంలో దరఖాస్తుదారుల డాక్యుమెంట్ల పరిశీలన కూడా సరిగా చేయలేదని అర్థమవుతోందన్నారు. ప్రధానంగా ఒకే మార్ట్‌గేజిపై ఇద్దరికి, ముగ్గురికి ఒకరి డాక్యుమెంట్ల జిరాక్సులే పెట్టి రుణాలు ఇవ్వడం, సొసైటీలో లేని సభ్యులకు రుణాలు ఇవ్వడం, అలాగే ఒకే సొసైటీలో 10 నుంచి 20 మందికి రుణాలు ఇవ్వడం, బినామీ పేర్లతో రుణాలు పొందేందుకు సహకరించడం లాంటి అక్రమాలకు యథేచ్ఛగా పాల్పడ్డారని, అందుకు అప్పటి అధికారులు సహకరించడం దారుణమన్నారు. ఈ క్రమంలో అర్హులు ఉన్నప్పటికీ కొన్ని సొసైటీల్లో ఒక్కరికీ కూడా ఎన్‌సీడీసీ రుణం మంజూరు చేయలేదని చెప్పారు. రుణాల మంజూరులో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు నగదు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు రూ.5 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసపాటి వెంకటరావు, జిల్లా కార్యదర్శి తోట తిరుపతరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ఆంజనేయులు, చిట్టిబోయిన చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర విచారణ చేపట్టి అక్రమాల
నిగ్గు తేల్చాలి
పశుసంవర్ధక శాఖ జేడీకి ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఫిర్యాదు