
గనుల శాఖ ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ
● కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. ప్రకాశం భవనంలోని తన ఛాంబర్‌లో గనులు, ఏపీ ఎండీసీ, పర్యావరణ కాలుష్యం నియంత్రణ మండలి, రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో బుధవారం ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లాలోని గనుల విస్తీర్ణం, వాటి రకాలు, లభిస్తున్న ఉపాధి, రవాణా, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, తదితర వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఆయా వివరాలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఇదే సమయానికి 18శాతం వృద్ధి ఉన్నట్లు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా ప్రభుత్వం మన జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలోని 12 స్టాక్ యార్డుల్లో 80 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ రాఘవరెడ్డి, డీటీసీ ఆర్.సుశీల, ఆర్టీసీ ఆర్‌ఎం జి.సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఒంగోలు ఆర్టీసీ డిపోలో చోరీ
● 10 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.9 వేల నగదు అపహరణ
ఒంగోలు టౌన్: దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ డిపో ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకొని దొంగలు చేతివాటం ప్రదర్శించి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సర్వేరెడ్డిపాలెంకు చెందిన పోపూరి సుమతి పర్చూరు వెళ్లేందుకు బుధవారం ఒంగోలు ఆర్టీసీ డిపోకు వచ్చారు. ఈ క్రమంలో బస్సు రాగానే ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ బస్సు ఎక్కారు. ఎందుకో అనుమానం వచ్చిన సుమతి తన పర్సు తీసి చూడగా అందులోని బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఆందోళన చెందిన ఆమె వెంటనే ఆర్టీసీ డిపోలో ఔట్‌పోస్టులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేబస్సులో కొత్తపట్నం మండలం ఆలూరు నుంచి ఇంకొల్లు వెళ్లేందుకు బస్సు ఎక్కిన కనపర్తి సువార్తమ్మ పర్సులోని రూ.9 వేల నగదు మాయమైనట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి సీసీ కెమెరాలు పరిశీలించారు. వన్‌టౌన్ సీఐ నాగరాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రాచర్ల: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఒద్దులవాగుపల్లెలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒద్దులవాగుపల్లె గ్రామానికి చెందిన మదిరె ఈశ్వర్‌రెడ్డి (60) అప్పుల బాధ భరించలేక బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఉరేసుకొని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

గనుల శాఖ ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ