
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
● అర్బన్ వైద్యశాలను
సందర్శించిన సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి
ఒంగోలు టౌన్: పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడడం దుర్మార్గమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి తీవ్రంగా విమర్శించారు. వైద్యం కోసం పేదలు అప్పులు చేస్తున్నారని, నిరుపేదలకు వైద్య సేవలను అందిస్తున్న అర్బన్ వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం నగర కమిటీ నాయకులతో కలిసి స్థానిక పాపాకాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో బుధవారం సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందిని, చికిత్స కోసం వచ్చిన రోగులను వైద్యశాలలో లభిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అత్యవసర సేవా రంగంగా గుర్తించిన వైద్యరంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడంతో నిరుపేదలు అనివార్య పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం అందుతున్న అరకొర ప్రభుత్వ వైద్యాన్ని సైతం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఒంగోలు నగరంలోని పాపా కాలనీలో పనిచేస్తున్న వైద్యుడిని మంగళవారం, గురువారం, శనివారం డిప్యూటేషన్‌పై నియమించడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు
ఇన్ సర్వీసు కోటా పునరుద్ధరించాలి
ప్రభుత్వ వైద్యులు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు పీజీ చేయడం పరిపాటేనని రమాదేవి చెప్పారు. గతంలో పీహెచ్‌సీ వైద్యులకు పీజీ ప్రవేశాల్లో 30 శాతం ఇన్ సర్వీసు కోటా ఉండేదని , దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసి 15 శాతానికి కుదించడం దారుణమన్నారు. పీహెచ్‌సీ వైద్యులకు కోటాను యథాతధంగా కొనసాగించాలని చెప్పారు. పీహెచ్‌సీ వైద్యుల సమ్మెను ఉపసంహరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని, వైద్యుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చీకటి శ్రీనివాసరావు, కంకణాల రమాదేవి, సయ్యద్ హుసేన్, ఆర్.శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసరావు, జి.రమేష్, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.