
వేలం తీరును పరిశీలించిన పొగాకు బోర్డు ఈడీ
ఒంగోలు సబర్బన్: త్రోవగుంటలోని పొగాకు వేలం కేంద్రం–2ను పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ బుధవారం పరిశీలించారు. వేలం కేంద్రాన్ని సందర్శించి వేలం విధానాన్ని పరిశీలించారు. వ్యాపారులతో కలిసి కొనుగోలు చేస్తున్న తీరును, రైతులకు ధర వస్తున్న వైనాన్ని కూడా పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల వద్ద పొగాకు స్టాక్ ఎంత ఉందో గ్రామాల వారీగా అడిగి తెలుసుకున్నారు. 2025–26 పంట కాలానికి బోర్డు ఇచ్చిన పరిమితి మేరకే పొగాకు సాగు చేసుకోవాలని కోరారు. ఒంగోలు–2 వేలం కేంద్రం సూపరింటెండెంట్ జే.తులసిని పొగాకు మార్కెట్ పరిస్థితిని, బ్యాలెన్స్ క్వాంటిటీ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్లాట్‌ఫాంలోని గోడౌన్‌ని కూడా పరిశీలించారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు ఆక్షన్ మేనేజర్ రామాంజనేయులు, రీజినల్ మేనేజర్ రామారావు, రైతు నాయకులు పాల్గొన్నారు.