
హైలెవల్ వ్యాపారం
కమిటీపై చర్యలు తీసుకోవాలి
ఒంగోలు సబర్బన్: బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్న ప్రముఖులు నిబంధనలకు పాతరేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాల్సింది పోయి నిలువునా పాతరేస్తున్నారు. కలెక్టర్, ఎస్పీలు కమిటీ సభ్యులుగా ఉన్న హైదరీ క్లబ్ నిర్వాహకులది ఇష్టారాజ్యమైంది. కలెక్టరేట్‌కు అతి సమీపంలో ఉన్న హైదరీ క్లబ్ ప్రాంగణంలో వందల సంవత్సరాల నాటి చెట్లను నిలువునా నరుకుతున్నారు. పచ్చదనానికి మారుపేరుగా ఉండే హైదరీ క్లబ్‌ను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాల కేంద్రంగా, జూదాలకు ఆలవాలంగా మార్చారు. క్లబ్‌లో కార్యదర్శిగా ఉండి.. అధికార పార్టీ అండదండలు దండిగా ఉన్న ఒక ప్రైవేటు వైద్యుడు, కోశాధికారిగా ఉంటూ రెవెన్యూ విభాగంలో కీలక పదవులు నిర్వహించి పదవీ విరమణ చేసిన వ్యక్తి క్లబ్‌లో భారీ వృక్షాలను నేలమట్టం చేసిన వారిలో కీలంకంగా వ్యవహరించారు.
వందల సంవత్సరాల చెట్లు నేలమట్టం
హైదరీ క్లబ్ ప్రాంగణంలో వందల సంవత్సరాల నాటి చెట్లు నేలమట్టం చేశారు. రావి, జువ్వి, వేప చెట్లు ఎత్తుకు ఎదిగి ఉండేవి. క్లబ్‌కు కేటాయించిన స్థలం కాకుండా వైద్య విధాన పరిషత్‌కు చెందిన స్థలాన్ని దాదాపు 53 సెంట్లు కబ్జా చేసీ మరీ దురాక్రమణకు పాల్పడ్డారు. రిక్రియేషన్ కోసం క్లబ్ ఏర్పాటు చేస్తే దాన్ని వ్యాపార కేంద్రంగా, అక్రమాలకు, జూద క్రీడలతో పాటు ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లా తయారు చేశారు. అవన్నీ వాళ్ల అంతర్గత వ్యవహారాలు అనుకుంటే.. పర్యావరణాన్ని నిలువునా హననం చేశారు. అసలు అంత పెద్ద భారీ వృక్షాలను కొట్టేయాల్సిన అవసరం వీళ్లకు ఎందుకు వచ్చింది. స్విమ్మింగ్ పూల్ అని, టెన్నీస్ కోర్టులని కాగితాల్లో చూపించి షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకునేందుకు వీళ్లకు ఎవరు అనుమతిచ్చారు. ఒంగోలు నగర పాలక సంస్థ ప్లాన్ అప్రూవల్ ఇవ్వకపోయినా ఏ విధంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు.
కలెక్టర్, ఎస్పీలకు క్లబ్ కమిటీలో
కీలక పదవులు
హైదరీ క్లబ్ కమిటీలో కలెక్టర్‌గా ఎవరున్నా ఆ అధికారి క్లబ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో అధికారి లా అండ్ ఆర్డర్‌ను తన చేతుల్లో ఉంచుకొనే ఎస్పీ కో ఆప్టెడ్ చైర్మన్‌గా ఉంటారు. జిల్లాని పరిపాలించే ఇద్దరు కీలకమైన అధికారులు హైదరీ క్లబ్ కమిటీలో ఉంటేనే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మరీ అక్రమాలకు పాల్పడుతుంటే ఎందుకు కళ్లప్పగించి చూస్తున్నారు. చెట్లు నరకడానికి అటవీ శాఖ అధికారులు అనుమతులు కూడా తీసుకోలేదు.
అక్రమాలు వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’
హైదరీ క్లబ్‌లో జరుగుతున్న అక్రమాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీన జిల్లా పేజీలో ‘కబ్జా విస్తరిస్తూ..కార్పొరేషన్ విస్మరిస్తూ’ అంటూ కథనాన్ని ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. అందులో స్పష్టంగా వైద్యవిధాన పరిషత్‌కు చెందిన స్థలాన్ని కబ్జా చేసి మరీ నిబంధనలకు విరుద్ధంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారని ప్రచురించాం. ఆ తర్వాత హైదరీ క్లబ్ పాలక మండలి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. హైదరీ క్లబ్ అక్రమాలపై జిల్లా రెవెన్యూ అధికారి బి.చినఓబులేసు విచారణ చేపట్టారు. అయినా క్లబ్ నిర్వాహకులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ఆపనేలేదు. ప్రధానంగా నగర కమిషనర్ కె.వెంకటేశ్వరరావు కమర్షియల్ కాంప్లెక్స్ అక్రమ నిర్మాణం విషయంలో పూర్తిగా సహకరించారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
హైదరీ క్లబ్‌లో పచ్చదనం హననం
పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న నిర్వాహకులు
వందల సంవత్సరాల నాటి చెట్లు నిలువునా నరికివేత
వైద్య విధాన పరిషత్ స్థలం 53 సెంట్లు యథేచ్ఛగా కబ్జా
బాధ్యులపై చర్యలకు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ డిమాండ్
హైదరీ క్లబ్ నిర్వాహకులు రూ.100 కోట్ల విలువైన వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ స్థలం కబ్జా చేశారు. సాక్షి దిన పత్రికలో వచ్చిన కథనాన్ని ఆధారంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. గత కలెక్టర్ కమిటీలో చైర్మన్‌గా ఉన్నా ఆమెకు తెలియకుండా అక్రమాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. కమిటీలో ఉన్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు. మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. డీఆర్‌ఓను విచారణాధికారిగా నియమించారు. ఈ మొత్తం వ్యవహారంలో నగర కమిషనర్ వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరించారు.
– చావలి సుధాకర్, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు

హైలెవల్ వ్యాపారం

హైలెవల్ వ్యాపారం