
బాధ్యత
సమాజంలో వృద్ధులపై చిన్నచూపు
మలిసంధ్యలో పట్టించుకునే వారు లేక మనోవేదన
నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం
వయోవృద్ధుల సంక్షేమానికి చర్యలు
ఒంగోలు వన్‌టౌన్: నవమాసాలు మోసి కని పెంచిన పిల్లలే వృద్ధాప్యంలో అసరాగా ఉంటారనుకుంటే ఆ భాగ్యం తల్లిదండ్రులకు కలగడం లేదు. వృద్ధులు సమాజానికి నాణ్యమైన వారసులు. వారి జ్ఞానం, అనుభవం అమూల్యమైన సంపద. కుటుంబాల్లో సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడంలో వారిదే కీలక పాత్ర. అయితే మలిసంధ్యలో పట్టించుకునేవారు లేక వృద్ధులు మనో వేదన చెందుతున్నారు.
కుటుంబ విలువలు ప్రశ్నార్థకం..
త్వరితగతిన మారుతున్న సమాజం, ప్రపంచీకరణ, సాంకేతిక పరిజ్ఞానం వల్ల జీవన ప్రమాణాలు పెరిగినా మానవీయ విలువలు క్షీణిస్తున్నాయి. మన–తన అన్న తేడా లేకుండా తల్లిదండ్రులపై దారుణాలకు పాల్పడే వారసుల ఉన్నారు. ‘మీరు మీ తల్లిదండ్రులను ఎలా చూస్తారో, మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చూస్తారు’ అనే సూక్తి యువత స్మరణలోంచి మాయమవుతోంది. ఐక్యరాజ్య సమితిలెక్కల ప్రకారం 2050 నాటికి దేశ జనాభాలో 21 శాతం వృద్ధులు ఉంటారని ఒక అంచనా. దీంతో భారత ప్రభుత్వం 1999లో జాతీయ వృద్ధుల విధానాన్ని రూపొందించింది. ఈ విధానాన్నే రాష్ట్ర ప్రభుత్వాలు కుడా అనుసరించాలని ఆదేశించింది.
వృద్ధులకు సదుపాయాలు తప్పనిసరి.
జాతీయ వృద్ధుల విధానంలో భాగంగా వృద్ధులు జీవితాన్ని సజావుగా గడిపేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు కల్పించాలి. ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి. రాయతీలు పొందేందుకు 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. పన్నుల చెల్లింపులో రాయితీ, బ్యాంకులో డిపాజిట్లపై అధిక వడ్డీ, అనాథలైన వృద్ధుల ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించాల్సి ఉంది. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధ్యర్యంలో వృద్ధులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అవాస యోజన పథకం ద్వారా పెద్దలకు గృహాల మంజూరు, రైల్వే రిజర్వేషన్‌లలో రాయితీ, ప్రయాణ టికెట్లలో 30 శాతం రాయితీలు, విమాన ప్రయాణ టికెట్లలో 50 శాతానికి పైగా రాయితీలు ప్రభుత్వం కల్పిస్తుంది. అర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీతో ప్రయాణం, రెండు సీట్లను వృద్ధులకు రిజర్వ్ చేస్తారు. జిల్లాలో మెత్తం జనాభాలో దాదాపు 20 శాతానికి పైగా వృద్ధులు ఉన్నారు. జిల్లాలో ప్రభుత్వ సహాయంతో మూడు వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి. వీటన్నింటిని ఉపయోగించుకుని వృద్ధులు కొంత వరకై నా ఆశ్రయం పొందవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 15 వరకు వృద్ధాశ్రమాలు ఉన్నా వాటిలో ఎక్కువగా చీరాల, బాపట్ల పరిసరాల్లో ఉండటంతో ప్రకాశం జిల్లాలో 3 వృద్ధాశ్రమాలు మాత్రమే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మరికొన్ని వృద్ధాశ్రమాలు ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వృద్ధులు కోరుతున్నారు.
రోజుకు రూ.54తో ఎలా..?
ఒంగోలులోని సీతారామపురంలో నడుస్తున్న సమతా వృద్ధాశ్రమంలో ప్రస్తుతం 25 మంది వృద్ధులు ఉంటున్నారు. ప్రభుత్వం వారి ఆహార ఖర్చుల కోసం రోజుకు ఒక్కొక్కరికి రూ.54 మాత్రమే విడుదల చేస్తోంది. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలతో పోషకాహారం కలిగిన ఆహారం ఈ ధరకు అందించడం చాలా కష్టంగా ఉందని ఆశ్రమ అధికారులు చెబుతున్నారు.
వయోవృద్ధుల సంక్షేమానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ప్రభుత్వ–స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే మూడు వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఒంగోలులో రెండు, కనిగిరిలో ఒక వృద్ధాశ్రమం ఉంది. కేంద్ర ప్రభుత్వం వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధుల పోషణ ఖర్చులకు నిధులు విడుదల చేస్తోంది.
– సీహెచ్ సువార్త, వయోవృద్ధుల శాఖ ఏడీ

బాధ్యత