
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో విఫలం
ఒంగోలు సిటీ: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు పర్రె వెంకటరావు అన్నారు. బీటీఏ జిల్లా కార్యాలయంలో మంగళవారం బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కర్ర దేవ సహాయం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు పర్రె వెంకటరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించటంలో ఘోరంగా విఫలమైందన్నారు. అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు ఉన్న ఆర్థిక, సర్వీసు సమస్యలు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 11 వ పీఆర్‌సీ టైం ముగిసి రెండేళ్లు పూర్తయినా కనీసం వేతన సవరణ కమిటీ వేయడానికి కూడా ప్రభుత్వం సుముఖంగా లేకపోవడం శోచనీయమన్నారు. బకాయిలు మొత్తం చెల్లిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే లేకపోవడం చూస్తే ఏమనుకోవాలి, సరెండర్ లీవులు చెల్లించకపోవడం, రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు బెనిఫిట్ లు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే స్పందించి 12 వ పీఆర్‌సీ కమిషన్ నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏల్చూరి మాధవరావు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 4 డీఎలను విడుదల చేయాలని, 11 వ పీఆర్సీ, సీపీఎస్ వారికి 90 శాతం చెల్లించాల్సిన డీఏ బకాయిలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టి కూటమి ప్రభుత్వానికి కూడా బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎం.శరత్ చంద్రబాబు మాట్లాడుతూ 2004 ముందు చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మెమో 57 అమలు, కోర్టు కేసులు క్లియర్ అయిన లాంగ్వేజ్ పండితుల పదోన్నతులు చేపట్టకపోవడం బాధాకరం అని, వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డీ మాల్యాద్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు అప్పగించరాదని యాప్‌ల భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని బీటీఏ పక్షాన డిమాండ్ చేశారు. అక్టోబర్ 7వ తేదీ జరిగే రాష్ట్ర ఫ్యాప్టో ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా నాయకులు పల్లె తిరుపతి స్వామి, కొండమోరి కొండల రాయుడు, బొంత కళ్యాణ్, అల్లరి విజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు.