
ఉద్యోగ విరమణతో కొత్త జీవన అధ్యాయం
● ఎస్పీ హర్షవర్థన్ రాజు
ఒంగోలు టౌన్: ఉద్యోగ విరమణతో జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు అన్నారు. సుదీర్ఘకాలం ఉద్యోగ జీవితంలో ఒత్తిడితో గడిపిన పోలీసు అధికారులు ఇప్పుడు కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని సూచించారు. మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన ఏఆర్ అడిషనల్ ఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావును పోలీసు కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానించారు. శాలువాకప్పి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం 34 ఏళ్లు వివిధ స్థాయిలో సేవలందించిన కొల్లూరి శ్రీనివాసరావు పోలీసు శాఖకు, ప్రజలకు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికి మాత్రమే ఉంటుందని, వ్యక్తిత్వానికి ఉండదని చెప్పారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, కఠిన పరిస్థితులను కూడా సులువుగా అధిగమించి విజయవంతంగా ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. పోలీసు ఉద్యోగిగానే కాకుండా రచయితగా, కవిగా, గాయకుడిగా కూడా కొల్లూరు శ్రీనివాసరావు రాణించారని, నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, తాలుకా సీఐ విజయకృష్ణ, వన్‌టౌన్ సీఐ నాగరాజు, ఆర్‌ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఏఆర్ ఎస్సైలు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.