
అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించండి
● కలెక్టర్ రాజాబాబు
కనిగిరిరూరల్: అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరం పరిష్కరించేలా దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక పవిత్ర ఫంక్షన్ హాలులో సోమ వారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై 814 అర్జీలు వచ్చాయని, వాటిలో 70 శాతం రెవెన్యూకి సంబంధించిన అర్జీలే ఉన్నాయన్నారు. రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న రోజుల్లో అర్జీల సంఖ్య తగ్గించాలని, అందుకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలతో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. . వైశాల్యం పరంగా జిల్లా విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున సమస్యలు విన్నవించుకునేందుకు జిల్లా కేంద్రానికి వచ్చేందుకు ప్రజలు ఎంతో వ్యయప్రయాసలకు లోనవుతారన్నారు. అందుకే ప్రజల వద్దకే వచ్చి అర్జీలు స్వీకరిస్తున్నామన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఎక్కడ జరిగితే అక్కడికే అధికారులంతా వస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, డీఆర్‌ఓ చిన్న ఓబులేసు, ఆర్డీఓ కేశవర్ధన్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, పార్ధసారధి, జాన్సన్‌లు పాల్గొన్నారు.