
ఈ–క్రాప్ గగనమే
నత్తనడకన ఈ–క్రాప్ నమోదు 37.12 శాతం దాటని పంట నమోదు నెలాఖరుతో ముగియనున్న గడువు ఈ–క్రాప్ నమోదు కాకపోవడంతో రైతుల ఆందోళన ఇప్పటికే మొదలైన పంట కోతలు
సాగు సగమే..
జిల్లాలో పంట నమోదు నత్తనడకన సాగుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నాలుగు నెలలు దాటుతోంది. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు, కొన్ని మండలాల్లో అధిక వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరో పక్క ముందస్తు సాగు చేసిన పంటలు కోతకు రావడంతో నూర్పిళ్లు మొదలవుతున్నాయి. ఈదశలో రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే ఈ–క్రాప్ నమోదుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఈ–క్రాప్ 37 శాతం మాత్రమే నమోదైంది. దీంతో ఖరీఫ్ సీజన్‌లో పంటలు వేసిన రైతులకు తీవ్ర నష్టం వచ్చే ప్రమాదం ఉంది. పంట నమోదు కాకపోవడంతో విపత్తుల సమయంలో పరిహారం, పంట అమ్మకాల సమయంలో ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.
20–31 శాతంలోపు
బేస్తవారిపేట:
జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటల ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పంటలతో సంబంధం లేకుండా ప్రతి ఎకరా భూమిని సర్వే నంబర్ల ఆధారంగా వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 1.30 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉండగా కేవలం 69 వేల హెక్టార్లలో సాగైంది. సగం మాత్రమే సాగు చేసిన పంటలకు ఈ–క్రాప్ బుకింగ్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కనపడుతోంది. వరిపంట 12,826 హెక్టార్లకు గాను 4,428, పత్తి 26,981కి 12,759 హెక్టార్లు, కంది 68,287కు 36,074, సజ్జ 7020 హెక్టార్లకు 2,918 హెక్టార్లలో సాగు చేశారు.
37.12 శాతం పూర్తి..
జిల్లా వ్యాప్తంగా 15,94,311 వెబ్‌ల్యాండ్ పార్శిల్స్ ఉండగా ఇప్పటి వరకు 5,91,858 ల్యాండ్ పార్శిల్స్ మాత్రమే పంట నమోదు పూర్తయింది. ఇంకా 63 శాతం ల్యాండ్ పార్శిల్స్‌కు ఈ–క్రాప్ నమోదు కావాల్సి ఉంది. ఈ నెల 30వ తేదీ లోపు ఈ–క్రాప్ నమోదు గడువు పూర్తి కానుంది. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది లక్ష్యాన్ని చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. గడువులోపు పంట నమోదు కాకుంటే విపత్తుల సమయంలో పరిహారం, పంట అమ్మకాల సమయంలో ఇబ్బందులు ఏర్పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సమన్వయ లోపం..
పంటల నమోదు వ్యవసాయ, రెవెన్యూ శాఖల సమన్వయంతో పూర్తి చేయాల్సి ఉంది. రైతులతో కలిసి పంట పొలాలకు వెళ్లి అక్కడ సాగులో ఉన్న పంట వివరాలు, సర్వే నంబర్ ఆన్‌లైన్‌లో నమోదు చేసి ధ్రువీకరణ చేసిన తర్వాతనే ఈ–క్రాప్ పూర్తి చేయాల్సి ఉంది. కానీ రెండు శాఖల మధ్య సమన్వయం లోపించింది. రెవెన్యూ సిబ్బంది ఈ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు.
బదిలీల నేపథ్యంలో..
వీఏఏల బదిలీల నేపథ్యంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడక్కడా కొందరు వ్యవసాయ సిబ్బంది మాత్రమే ఈ ప్రక్రియను మమ అనిపిస్తున్నారు. గ్రామంలో ఎక్కడో ఒకచోట కూర్చొని తూతూమంత్రంగా నమోదు చేస్తున్నారనే విమర్శలు బలంగా వినపడుతున్నాయి. దీంతో ఈ–క్రాప్ నమోదులో స్పష్టత ఎంత వరకూ అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది.
నత్తనడకకు కారణాలు:
● గుట్టలు, చిల్లకంప ఉన్న సర్వే నంబర్లలో దగ్గరికి వెళ్తేకానీ జియో ట్యాగింగ్ తీసుకోవడం లేదు.
● కొత్తగా వీఏఏలు గ్రామాలకు రావడంతో రైతులపై, గ్రామంలోని సర్వే నంబర్లపై పట్టులేకపోవడం.
● ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం సర్వే నంబర్ల వారీగా పంట సాగు చేసిన లేదా బీడుగా ఉన్నా జియో మ్యాపింగ్ చేసి, ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. ఈ తతంగం క్షేత్ర స్థాయిలో పూర్తికావడానికి ఎక్కువ సమయం పడుతోంది.
● భూములు రీసర్వే జరిగిన గ్రామాల్లో ఎల్‌పీ నంబర్లకు వ్యవసాయశాఖ సిబ్బంది దగ్గరున్న సర్వే నంబర్లకు సరిపోకపోవడంతో సమస్య ఎదురవుతోంది.
● బయోమెట్రిక్ పడని రైతులకు ఐరిస్ చేయడానికి సిగ్నల్ సమస్య వేధిస్తోంది.
● వెబ్‌ల్యాండ్, అటవీ భూముల్లో పంటలు ఉన్నా లేకపోయినా ఫీల్డ్ సర్వే చేయాలి. బీడు భూములను అయిదేళ్లకు పైగా సాగు చేయనివి, 1–5 ఏళ్ల మధ్య చేయనివి, ఈ ఏడాది మాత్రమే చేయనిగా విడదీయాలి.
నా పంట ఈ–క్రాప్‌లో నమోదు కాలేదు
ఐదు ఎకరాల్లో కందిపంట సాగుచేశాను. నా పంట ఈ–క్రాప్‌లో నమోదు చేసేందుకు అధికారులు రాలేదు. ఈ–క్రాప్ విధానాన్ని సక్రమంగా అమలు చేయకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరపొందే అవకాశాన్ని కోల్పోతాం. పండించిన పంటలు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ఈ–క్రాప్ నమోదై ఉండాలి.
– పీ సుబ్బారెడ్డి, రైతు,
బేస్తవారిపేట

ఈ–క్రాప్ గగనమే

ఈ–క్రాప్ గగనమే