పెరిగిన భారం..అందని జీతం | - | Sakshi
Sakshi News home page

పెరిగిన భారం..అందని జీతం

Sep 29 2025 11:07 AM | Updated on Sep 29 2025 11:07 AM

పెరిగిన భారం..అందని జీతం

పెరిగిన భారం..అందని జీతం

చిరుద్యోగుల కష్టాలు పట్టని కూటమి ప్రభుత్వం నెలల తరబడి జీతాలు లేక అవస్థలు పడుతున్న శానిటరీ వర్కర్లు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 230 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు వైద్యశాలలు అప్‌ గ్రేడ్‌ చేసినా సిబ్బందిని పెంచకపోవడంతో పెరిగిన పని భారం ధర్నాలకు దిగుతున్నా స్పందించని వైనం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వం కొన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుండటంతో ఇప్పటికే కొందరు చిరుద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడగా మరి కొందరు ఉద్యోగులు జీతాలు సక్రమంగా అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో ఔట్‌సోర్సింగ్‌ శానిటరీ కార్మికులుగా పనిచేస్తున్న వారికి ఇచ్చే కొద్దిపాటి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా నెలల తరబడి జాప్యం చేస్తుంటే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కంభం: కూటమి ప్రభుత్వం తీరుతో ప్రభుత్వ వైద్యశాలల్లో ఔట్‌ సోర్సింగ్‌ కింద పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న సిబ్బంది నెలల తరబడి జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 18 వైద్యశాలల్లో సుమారు 230 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులున్నారు. కంభం, గిద్దలూరు, దోర్నాల, యర్రగొండపాలెం, పామూరు, కనిగిరి, పొదిలి, కొండపి, చీమకుర్తి, ఒంగోలు, మార్కాపురం తదితర వైద్యశాలల్లో వీరంతా విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ థర్డ్‌ పార్టీ ఏజన్సీ ద్వారా జీతాలు చెల్లిస్తుంటారు. శానిటరీ పనిచేసే సిబ్బందికి రూ.11,858, సూపర్‌ వైజర్లకు రూ.13,500 జీతం ఉంటుంది.

సిబ్బందిని పెంచకపోవడంతో పెరిగిన పని ఒత్తిడి:

‘ఫస్ట్‌ ఆబ్జెక్టివ్‌ ఏజెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ ద్వారా ప్రభుత్వ వైద్యశాలలో శానిటరీ వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. 30 పడకల వైద్యశాలలో 8 మంది, 50 పడకల వైద్యశాలలో 13 మంది, 100 పడకల వైద్యశాలల్లో సుమారు 30 మంది వరకు విధులు నిర్వహించాల్సి ఉంది. శానిటరీ ఉద్యోగులు విదుల్లో చేరిన కొంతకాలానికే కొన్ని వైద్యశాలలు 30 పడకల నుంచి 50 పడకలకు, 50 పడకల నుంచి 100 పడకల వైద్యశాలలుగా అప్‌ గ్రేడ్‌ అయ్యాయి. అప్‌ గ్రేడ్‌ చేసిన తర్వాత అందుకు తగ్గట్టుగా సిబ్బంది సంఖ్యను పెంచకపోవడంతో తమ పై పనిభారం పెరిగిందని శానిటరీ వర్కర్లు వాపోతున్నారు.

6–7 నెలలుగా అందని వేతనాలు:

జూన్‌, జూలై నెలల వరకు జీతాలకు సంబంధించిన బిల్స్‌ పంపించినప్పటికీ జీతాల విడుదలలో జాప్యం ఎందుకని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని కొన్ని వైద్యశాలల్లో 5–6 నెలల జీతాలు పెండింగ్‌ లో ఉండగా, మరికొన్ని చోట్ల 7 నెలల వరకు జీతాలు రాలేదని ఉద్యోగులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించే ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో పాత ఏజెన్సీ తొలగించి కొత్త వారికి అప్పగిస్తే తమ జీతాల పరిస్థితి ఏంటని ఉద్యోగుల్లో ఆందోళన మొదలవుతోంది. గతంలో పీఎఫ్‌ డబ్బులు ప్రతినెలా తమ ఖాతాల్లో జమయ్యేవని, గత కొన్ని నెలలుగా పీఎఫ్‌ డబ్బులు తమ ఖాతాల్లో జమ కావడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఎవరిని అడిగినా స్పందించడం లేదని ఉన్నతాధికారులు స్పందించి జీతాలతో పాటు పీఎఫ్‌ డబ్బులు ప్రతి నెల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆందోళన బాటలో కార్మికులు:

సుమారు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని, వెంటనే జీతాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 15వ తేదీ యర్రగొండపాలెం ఏరియా వైద్యశాల వద్ద సీఐటీయూ నాయకులతో కలసి పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించకపోతే అదే బాటలో మిగిలిన వైద్యశాలల్లో పనిచేసే సిబ్బంది ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. సీజనల్‌ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలి వైద్యశాలకు రోగులు క్యూ కడుతున్న నేపథ్యంలో శానిటరీ వర్కులు ఆందోళన బాటకు దిగితే వైద్యశాలల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా మారిపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement