
డిజిటల్ యాప్
కూటమి అరాచకాలను ఎదుర్కొనేందుకే
యర్రగొండపాలెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కోవటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక డిజిటల్ బుక్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులో ఐటీ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న జిల్లాకు చెందిన వారు డిజిటల్ బుక్ యాప్‌ను ఆదివారం ఎమ్మెల్యేతో ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్నివర్గాలకు చెందిన పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను పక్కనపెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అన్యాయాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు నమోదు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. అటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు జగనన్న డిజిటల్ బుక్ యాప్‌ను ప్రారంభించారన్నారు. ఎవరికై నా అన్యాయం జరిగితే ఈ యాప్‌లో నమోదవుతుందని, ఈ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగాహన పరచాలని అన్నారు. కార్యక్రమంలో పెద్దారవీడు మండల మాజీ జెడ్పీటీసీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి, పెద్దదోర్నాల మండల పార్టీ కన్వీనర్ గంట వెంకటరమణారెడ్డి, నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షుడు దుద్యాల రామకృష్ణారెడ్డి, లింగంగుంట్ల ప్రవీణ్, వెన్నా కాశీశ్వరరెడ్డి, కొల్లి నాగేశ్వరరెడ్డి, మూల హర్షవర్ధన్, కందుల వెంకటసుబ్బారెడ్డి, పతంగి అంజిరెడ్డి పాల్గొన్నారు.