
దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
యర్రగొండపాలెం: సాక్షాత్తు శాసనసభలోనే హోం మంత్రి వంగలపూడి అనిత ఒక కులానికి చెందిన వ్యక్తిని ఇంకొక కులానికి చెందిన వ్యక్తిగా తన పేరును మార్చి చదవడమనేది అత్యంత దిగజారుడు రాజకీయమని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. అసెంబ్లీలో శనివారం హోం మంత్రి అనిత గుర్రం చలపతి చౌదరిపై మాట్లాడుతూ ఆయన చౌదరి కాదని, రెడ్డి కులానికి చెందిన వాడని వ్యాఖ్యానించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంత దిగజారుడు రాజకీయం చేసే పరిస్థితికి కూటమి ప్రభుత్వం రావడం వారి పరిపాలనకు అద్దం పడుతోందన్నారు. చంద్రబాబు సామాజిక వర్గంలో వచ్చిన వ్యతిరేకతను, జగనన్నపై ఉన్న అభిమానాన్ని తట్టుకోలేకే కుల ప్రస్ధావన చేయకూడని చట్టసభలో ఆ విధంగా మాట్లాడినందుకు కచ్చితంగా క్షమాపణ చెప్పాలన్నారు. వైఎస్సార్ సీపీలో కమ్మ వాళ్లు ఉండకూడదు, ఉంటే వారిని ఏవిధంగానైనా డామేజ్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిట్లేనని ఆయన అన్నారు. గుర్రం చలపతి చౌదరిది మేడపి అని, వాళ్లది చౌదరి కుటుంబం, వైఎస్సార్ సీపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు, జగనన్న అభిమానులు లక్షల మంది ఉన్నారనటానికి ఇదో ఉదాహరణ అని అన్నారు. గతంలో నాని, వల్లభనేని వంశీలను కమ్మ సామాజిక వర్గంలో వైఎస్సార్ సీపీలో బలంగా ఉన్నవారిని ఏ విధంగా ఇబ్బందిపెట్టారో.. అదేవిధంగా చిట్టచివరికి సోషల్ మీడియా వారిపై కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందనటానికి మచ్చుతునక అని అన్నారు.