
గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలి
గిరిజనుల సంక్షేమానికి ఉద్దేశించిన నిధులను గిరిజనులకే ఖర్చు చేయాలి జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్
ఒంగోలు వన్‌టౌన్: గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కమీషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశం ఒంగోలు గిరిజన భవన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో ఇతరులను చేరిస్తే ఉద్యమిస్తామన్నారు. మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్నారు. గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. గిరజన హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. గిరిజనులకు కనీసం ఇంటి వసతి, గానీ, మంచి నీటి వసతి గానీ లేని గ్రామాలు ఇప్పటికీ అనేకం ఉన్నాయన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేని గిరిజనులకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వీటిని ఏర్పాటు చేయాలన్నారు. గిరిజనుల సంక్షేమానికి ఉద్దేశించిన నిధులను గిరిజనులకే ఖర్చు చేయాలని కోరారు. షెడ్యూల్డు తెగల జాబితాలో సుగాలీ, చెంచు, ఎరుకల, యానాది, నక్కల అనేక జాతు ఉన్నాయని వీరందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించడంలేదన్నారు. మైదాన ప్రాంతాలైన కదిరి, కావలి, మాచర్ల, జగ్గయ్య పేట, నాలుగు అసెంబ్లీ స్థానాలను ఎస్టీలకు రిజర్వేషన్ చేయాలన్నారు. సమావేశంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం, ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ కుమార్ ధర్మా, జీపీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణునాయక్, డాక్టర్ బాలాజీ నాయక్, ఆర్ హనుమా నాయక్, జె సంతోష్ నాయక్, ఏ శ్రీను నాయక్, రవీంద్ర నాయక్, దుర్గా నాయక్, జీ గణేష్ నాయక్, బండి రూతమ్మ, కాకి రమణమ్మ, పాములేటి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.