
మధ్యతరగతికి అందుబాటులో భవనాల నిర్మాణం
● క్రెడాయ్ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు
ఒంగోలు సబర్బన్: మధ్యతరగతికి కూడా అందుబాటులో ఉండేలా అపార్ట్‌మెంట్లు, ఇండివిడ్యువల్ భవనాల నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు క్రెడాయ్ (బిల్డర్స్ అసోసియేషన్) నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పాత గుంటూరు రోడ్డులోని పాటిబండ్ల గోపాల స్వామి ఫంక్షన్ హాలులో క్రెడాయ్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. క్రెడాయ్ జిల్లా అధ్యక్షుడు జీ.రాజేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ద్రవ్యోల్బణం పెరుగుతున్న దృష్ట్యా అపార్ట్‌మెంట్ల ప్లాట్లు, వ్యక్తిగత భవనాల ధరలు పెరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువుల మీద జీఎస్‌టీ తగ్గించటం మంచి పరిణామమన్నారు. సెక్రటరీ కే.ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం నాలా చార్జీలను తీసేసి, నిర్మాణాల విషయంలో స్థానిక సంస్థలకు ఆ బాధ్యతలు అప్పజెప్పిందన్నారు. వాటితో పాటు అపార్ట్‌మెంట్ల విషయంలో సెట్ బ్యాక్స్ 24 మీటర్లలోపు, 24 మీటర్లకు పైన అనే విషయంలో అందరూ అర్థం చేసుకొని ముందుకు సాగాలన్నారు. క్రెడాయ్ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ బిల్డర్స్‌కు సంబంధించిన సమస్యలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం వాటిని వెంటనే పరిష్కరిస్తే బిల్లర్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. తొలుత జరిగిన కార్యవర్గ సమావేశంలో కొన్ని తీర్మానాలను కమిటీ ఆమోదించింది. కార్యక్రమంలో జిల్లా చైర్మన్ ఎన్.రఘు రామయ్య, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్.హరి ప్రసాద రావు, ట్రెజరర్ ఎం.తిరుమల, జాయింట్ సెక్రటరీ సిహెచ్.రాఘవ రెడ్డి, ఈసీ మెంబర్లు టి.వరుణ్ కుమర్, వై.ఇస్సాక్ న్యూటన్, కే.రఘునాథ్, ఏవిఎన్ బాబు, పి.నాగేశ్వరరావు, సలహాదారులు ఐవీ.వీర బాబు, ఎం.శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.