
అక్షరాయుధం.. జాషువా కవిత్వం
● డీఆర్వో ఓబులేసు
ఒంగోలు వన్‌టౌన్: జాషువా కవిత్వం సామాజిక అసమానతలపై చేసిన పోరాటంలో అక్షరాయుధంగా నిలిచిందని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) చిన్న ఓబులేసు అన్నారు. గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలను స్థానిక కలెక్టరేట్‌లోని జాషువా విగ్రహం వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.లక్ష్మానాయక్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఆర్వో మాట్లాడుతూ తన రచనల ద్వారా సమాజంలో సంస్కరణలకు పాటుపడిన వ్యక్తి గుర్రం జాషువా అని కొనియాడారు. కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏపీ ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, తదితరులు పాల్గొని జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత నాయకులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.