
నకిలీలకు చెక్..!
ఆయిల్ అక్రమాలు లీక్..
సింగరాయకొండ: డీజిల్ వాహనాల నుంచి వెలువడే ప్రమాదకరమైన నైట్రోజన్ ఆకై ్సడ్ (ఎన్‌ఓఎక్స్) ఉద్గారాలను తగ్గించి వాయు కాలుష్యాన్ని నివారించడానికి డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డీఈఎఫ్) అనే ఆయిల్‌ను వినియోగిస్తారు. దీనినే యాడ్ బ్లూ ఆయిల్ అని అంటారు. బీఎస్–6 డీజిల్ వాహనాలలో యాడ్ బ్లూ ఆయిల్‌ను కచ్చితంగా వాడాలి. లేకుంటే వాహనం ఆగిపోవడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు నకిలీ ఆయిల్ తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రముఖ కంపెనీల ఆయిల్ అంటూ వాహనదారులను నమ్మించి మోసం చేస్తున్నారు. జాతీయ రహదారిపై సింగరాయకొండ మండలంలోని విమానాల రన్‌వే పక్కన ఈ అక్రమ వ్యాపారం కొన్నాళ్లుగా జోరుగా సాగుతోంది. ఇటీవల ఒక ప్రముఖ కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు చేయడంతో ఆయిల్ మాఫియా గుట్టు రట్టయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రముఖ కంపెనీల ఆయిల్ పేరుతో నకిలీ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.80 వేల విలువైన 20 లీటర్ల డబ్బాలు 68 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
7 పాయింట్ల ద్వారా
నాశిరకం ఆయిల్ విక్రయాలు...
డీజిల్ వాహనాల ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం యాడ్ బ్లూ ఆయిల్‌ను ప్రవేశపెట్టింది. 2022 నుంచి బీఎస్–6 మోడల్ కార్ల నుంచి భారీ వాహనాల వరకు అన్నింట్లో ఈ ఆయిల్ ఉపయోగిస్తారు. ఆయా వాహనాలలో డీజిల్ ట్యాంకు పక్కనే యాడ్ బ్లూ ఆయిల్ ట్యాంకు ఉంటుంది. వాహనాన్ని బట్టి 20 నుంచి 60 లీటర్ల కెపాసిటీతో ఈ ఆయిల్ ట్యాంకులు ఉంటాయి. లీటరు యాడ్ బ్లూ ఆయిల్ ధర 60 రూపాయలు ఉంటుంది. కొందరు అక్రమార్కులు సాధారణ కంపెనీలు తయారు చేసిన నాశిరకం ఆయిల్ తీసుకొచ్చి ప్రముఖ బ్రాండ్ల స్టిక్కర్లు వేసి అమ్మకాలు సాగిస్తూ వాహనదారులను మోసగిస్తున్నారు. జాతీయ రహదారిపై సింగరాయకొండ మండల పరిధిలో ఉన్న విమానాల రన్‌వే పక్కన రోడ్డుకు ఇరువైపులా సుమారు సంవత్సర కాలంగా ఈ ఆయిల్ అమ్మకాలు సాగిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఐరన్ స్టాండ్ల మీద తెల్లట్యాంకు ఏర్పాటు చేస్తారు. తమ వద్ద ప్రముఖ బ్రాండ్ల యాడ్ బ్లూ ఆయిల్ దొరుకుతుందని బోర్డులు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. రన్‌వే పక్కన 7 పాయింట్లలో ట్యాంకుల ద్వారా వాహనాలకు నేరుగా ఆయిల్ నింపుతున్నారు. ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు ఉన్న 20 లీటర్ల డబ్బాలు కూడా అమ్ముతారు.
వారానికి ఒకసారి ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఉన్న నకిలీ ఆయిల్ డబ్బాలను లారీలలో తీసుకొచ్చి వీరికి కొందరు అప్పగిస్తున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సిబ్బందిని ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్న ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుండగా, ఓ ప్రముఖ ఆయిల్ కంపెనీకి చెందిన ప్రతినిధి ఈ నెల 24వ తేదీ దీనిపై ఫిర్యాదు చేశారు. విమానాల రన్ వే పక్కన రాజ్ ఎంటర్ ప్రైజెస్, మహదేవ్ మోటార్స్, బాలాజీ మోటార్స్ పేరు మీద నిర్వాహకులు ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఉన్న యాడ్ బ్లూ ఆయిల్ క్యాన్‌లు తీసుకొచ్చి వాహనదారులను మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్ద ట్యాంకులలో యూరియా, వాటర్ కలిపి యాడ్ బ్లూ ఆయిల్ తయారు చేసి మరీ విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హైవేపై పోలీసుల పర్యవేక్షణ శూన్యం...
ఆయిల్ మాఫియాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న జాతీయ రహదారిపై పోలీసులు పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంవత్సరం నుంచి ఒడిశాకు చెందినవారు యాడ్ బ్లూ ఆయిల్ పేరుతో అక్రమ వ్యాపారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి విమానాల రన్‌వేకి ఇరువైపులా ఎలాంటి షాపులు ఏర్పాటు చేయకూడదు. కానీ, ఆయిల్ మాఫియా అక్కడ 7 పాయింట్లు ఏర్పాటు చేసి మరీ ఒడిశా సిబ్బందిని ఏర్పాటు చేసి నకిలీ ఆయిల్ విక్రయిస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు.. ఇక్కడ ఏం చేస్తున్నారు.. వారు చేస్తోంది అక్రమమా.. సక్రమమా అని ఏరోజైనా పోలీసులు పట్టించుకున్నారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నేటికీ యాడ్ బ్లూ ఆయిల్ అమ్మే ఆయిల్ ట్యాంకులను పోలీసులు స్వాధీనం చేసుకోకపోవడంతో అవి ఇప్పటికీ రోడ్డు పక్కనే ఉన్నాయి. వాటిలో పనిచేసే సిబ్బంది పరారయ్యారని పోలీసులు చెబుతుండటం విశేషం. గత ఆరు నెలల క్రితం విమానాల రన్‌వే పక్కన కళ్యాణ మండపం సమీపంలో లారీల నుంచి డీజిల్ చోరీ చేసే ముఠా స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసుకుందని పత్రికలలో కథనాలు రావటంతో అక్కడి నుంచి దుకాణం ఎత్తివేశారని, అతనికి పోలీసుల సహకారం కూడా ఉందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో యాడ్ బ్లూ ఆయిల్ మాఫియా పట్ల కూడా ఏడాది నుంచి పోలీసులు పట్టించుకోకపోవడం, ఓ కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు చేసినా మొక్కుబడిగా చర్యలు తీసుకోవడంతో పోలీసుల తీరుపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డీజిల్ వాహనాలలో వాడే యాడ్ బ్లూ ఆయిల్ పేరుతో సింగరాయకొండ మండలంలో దందా
ప్రముఖ కంపెనీల ఆయిల్ అంటూ నకిలీ ఆయిల్ అమ్మకం
జాతీయ రహదారిపై విమానాల రన్‌వే పక్కన నాశిరకం యాడ్ బ్లూ ఆయిల్ విక్రయం
ప్రముఖ బ్రాండ్ల ఆయిల్ అని చెప్పడంతో నమ్మి కొనుగోలు చేసి మోసపోతున్న వాహనదారులు
ప్రముఖ కంపెనీ ప్రతినిధి ఫిర్యాదుతో ఆయిల్ మాఫియా మోసాలు బట్టబయలు
కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేసిన పోలీసులు
దుకాణాలు తొలగించాం
రాజస్థాన్‌కు చెందిన ముఠా ఆధ్వర్యంలో యాడ్ బ్లూ ఆయిల్ మాఫియా జరుగుతోంది. వీరు యూరియా, నీరు కలిపిన మిశ్రమాన్ని ప్రముఖ కంపెనీ బ్రాండ్ల పేరుతో అమ్ముతున్నారన్న ఫిర్యాదు రావడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. 20 లీటర్ల ఆయిల్ డబ్బాలు 68 స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన వారు పరారయ్యారు. ప్రస్తుతం ఆ దుకాణాలు తొలగించాం.
– బి.మహేంద్ర, ఎస్సై, సింగరాయకొండ

నకిలీలకు చెక్..!

నకిలీలకు చెక్..!