
మాజీ సర్పంచ్ కుటుంబం గ్రామ బహిష్కరణ
కొత్తపట్నం: చర్చికి వెళుతున్నారనే నెపంతో ఒక కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామ పంచాయతీ పరిధిలో చెంచుపాపాయిపాలెం పట్టపుపాలెంలో మాజీ సర్పంచ్ బసంగారి ప్రసాద్ తల్లి రాములమ్మ ఈతముక్కలలోని చర్చిలో ప్రార్థన కోసం వెళ్తుంటారు. అలా చర్చికి వెళ్లడం గ్రామ కాపులకు ఇష్టం లేదని గత సంవత్సరం నుంచి ఆ కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామంలోని రచ్చబండ వద్దకు పిలవడం, మీ తల్లి చర్చికి వెళ్లడం ఆపకపోతే మీ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేస్తామని హెచ్చరించడం జరుగుతూ వస్తోంది. గత సంవత్సరం క్రిస్మస్ పండుగ నుంచి గ్రామపెద్దల వేధింపులు ఎక్కువయ్యాయి. వారి ఇంటికి తాగునీటి పైపులైన్ కట్ చేశారు. ప్రసాద్ ట్రాక్టర్, జేసీబీలు తిప్పుతుంటాడు. గ్రామంలోని ఓ హేచరీకి ట్యాంకర్లతో నీళ్లు తోలుతుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తులు హేచరీ నిర్వాహకులను ప్రసాద్ చేత నీళ్లు తెప్పించుకున్నా.. ఇతర ఏ పనులు చేయించుకున్నా హేచరీ మూతవేయిస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో హేచరీ నిర్వాహకులు అతడి చేత పనులు ఆపించారు. ఈ క్రమంలో ఆదివారం ప్రసాద్ ఇంట్లోని వ్యక్తులను బయటకు పిలిపించిన గ్రామకాపులు బలవంతంగా ఇంటికి తాళం వేశారు. గతంలో గ్రామంలో కొంత మొత్తాన్ని ఎవరో ఒకరు పాటలాగా పాడుకుని ఆ డబ్బులు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తుంటారు. ప్రసాద్ కూడా కొంత నగదు తీసుకున్నాడు. డబ్బు తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఇంటికి తాళం వేశామని గ్రామకాపులు చెబుతున్నారు. వాస్తవానికి వచ్చే నెల 20వ తేదీ వరకు పాట చెల్లింపు గడువు ఉందని, కేవలం తన తల్లి చర్చికి వెళ్తుందన్న కారణంతోనే ఇలా ఇంటికి తాళం వేశారని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామంలో నుంచి తమ కుటుంబాన్ని వెలివేసే హక్కు వారికి ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయంపై కొత్తపట్నం పోలీసులకు ఫోన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.
ప్రార్థనకు చర్చికి వెళ్తున్నారని ఇంటికి తాళాలు
తాగునీటి పైపులైన్ తొలగింపు