
ద్విచక్ర వాహనం – ఆర్టీసీ బస్సు ఢీ
మృతిచెందిన జశ్వంత్
ప్రమాదానికి కారణమైన కర్ణాటక ఆర్టీసీ బస్సు
● యువకుడు దుర్మరణం
పెద్దదోర్నాల: ఎదురెదురుగా వచ్చిన కర్ణాటక ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన కర్నూలు – గుంటూరు జాతీయ రహదారిపై కొత్తూరు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా మదనపల్లె తంబళ్లపల్లికి చెందిన బీటెక్ విద్యార్థి ఈడకొట్టు జశ్వంత్ (20) దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న ఏఎస్సై కృష్ణమూర్తి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి కృష్ణమూర్తి కథనం మేరకు.. కర్నూలు నుంచి ద్విచక్ర వాహనంపై పెద్దదోర్నాల మండల కేంద్రం వైపునకు వస్తున్న జశ్వంత్‌ను శ్రీశైలం నుంచి ఆత్మకూరు వైపునకు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు కొత్తూరు వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన జశ్వంత్.. సంఘటన స్థలంలోనే తుది శ్వాస విడిచాడు. మృతుడు మార్కాపురం పట్టణంలోని ఏ1 గ్లోబల్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించనున్నట్లు ఏఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు చెప్పారు.

ద్విచక్ర వాహనం – ఆర్టీసీ బస్సు ఢీ

ద్విచక్ర వాహనం – ఆర్టీసీ బస్సు ఢీ