
పెంపుడు కుక్కలకు రేబిస్ రాకుండా చూసుకోవాలి
ఒంగోలు సబర్బన్: పెంపుడు కుక్కలకు రేబిస్ రాకుండా వాటి యజమానులు క్రమం తప్పకుండా రేబిస్ ఇంజక్షన్లు వేయించాలని పశుసంవర్థకశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ సూచించారు. ఆదివారం వరల్డ్ రేబిస్ డేని పురస్కరించుకుని ఒంగోలు సంతపేటలోని జిల్లా పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వెటర్నరీ పాలీక్లినిక్‌లో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ ఇంజక్షన్లు వేశారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ కే వెంకటేశ్వరరావు ప్రారంభించగా, ఒంగోలు నగరంలోని పెంపుడు కుక్కల యజమానులు వాటిని తీసుకొచ్చి రేబిస్ ఇంజక్షన్లు వేయించారు. సుమారు 275 పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి రాకుండా టీకాలు వేసినట్లు సంతపేటలోని పాలీక్లినిక్ పశువైద్యుడు, పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.జగత్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, శానిటరీ సూపర్‌వైజర్ బాబ్జి, పశువైద్యులు డాక్టర్ సురేంద్ర, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
క్రమం తప్పకుండా రేబిస్ ఇంజక్షన్లు వేయించాలి
జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ రవికుమార్
వరల్డ్ రేబిస్ డే సందర్భంగా ఒంగోలులోని పశువైద్యశాలలో ఉచితంగా రేబిస్ ఇంజక్షన్లు