
పవన్ కళ్యాణ్‌ని అడ్డుపెట్టుకుని సనాతన ప్రచారం
ఒంగోలు టౌన్: పవన్ కళ్యాణ్‌ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సీఎస్ సాగర్ విమర్శించారు. నగరంలోని మాదాల నారాయణస్వామి భవన్‌లో ఆదివారం సత్యశోధక్ సమాజ్ 153వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సభకు ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.మోహన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఓటు బ్యాంకును సంఘటితం చేసుకోవడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ శక్తులు అధికారంలోకి వచ్చాయని చెప్పారు. దళిత కులాల మధ్య గల సాంస్కృతిక వైరుద్యాన్ని ఉపయోగించుకుని కులవ్యవస్థలను కాపాడుతున్నాయని విమర్శించారు. దక్షిణ భారతదేశంలో కూడా కులవ్యవస్థలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. దళిత కమ్యూనిస్టులు ఏకమై కుల వ్యవస్థను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు. అందుకోసం విప్లవ శక్తులు పోరాడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పద్మ, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, అఖిల భారత రైతు కూలీ సంఘ జిల్లా అధ్యక్షుడు నాంచార్లు, అరుణోదయం సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ జాలన్న పాల్గొన్నారు.