
ఎకో టూరిజానికి గ్రీన్ సిగ్నల్
● వచ్చే నెల 1వ తేదీ నుంచి తెరుచుకోనున్న జంగిల్ సఫారీ
● మొదలు కానున్న ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం
పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలోని ఎకో టూరిజానికి సంబంధించిన జంగిల్ సఫారీలతో పాటు నల్లమలలోని ప్రసిద్ధి గాంచిన ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయ యాత్రలు వచ్చే నెల 1వ తేదీ నుంచి పునః ప్రారంభించనున్నట్టు పెద్దదోర్నాల రేంజి అధికారి హరి తెలిపారు. పెద్దపులులు తమ సంతానోత్పత్తి ప్రక్రియను కొనసాగించేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 తేదీ వరకు దట్టమైన అభయారణ్యంలోని నిషిద్ధ ప్రాంతాల్లోకి పర్యాటకులు, ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సాధారణంగా నిషేధిత సమయం పూర్తిగా వర్షాకాలం కావడంతో కురిసిన వర్షాలతో అడవంతా పచ్చగా దట్టమైన చెట్లు, పొదలతో నిండి ఉంటుంది. ఈ కాలంలోనే పెద్దపులులు తాము జత కట్టిన ఆడపులులతో ప్రశాంతంగా సంచరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో వాటి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా ఉన్న 50 పులులు సంరక్షణా కేంద్రాల్లోని ఎకోటూరిజాలు, జంగిల్ సఫారీలలో పర్యాటకులను సంచరించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని పలు ప్రాంతాల్లో మూత పడిన ఎకో టూరిజాలతో పాటు పలు పర్యాటక కేంద్రాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో గిద్దలూరు సమీపంలో ఉన్న పచ్చర్ల, ఆత్మకూరు సమీపంలో ఉన్న బైర్లూటి, మండల పరిధిలోని తుమ్మలబైలు, ఎకోటూరిజాలకు సంబంధించిన జంగిల్ సఫారీలతో పాటు, యర్రగొండపాలెం మండల పరిధిలో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి.