
80 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసులు పేకాట, కోడిపందేలు, మట్కా స్థావరాలపై పంజా విసిరారు. జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టారు. కలుగులో దాక్కున్న ఎలుకలను పట్టుకున్నట్లు కొండ ప్రాంతాలు, పొలాలతోపాటు రహస్య ప్రదేశాలలో పేకాటాడుతున్న వారిని పట్టుకున్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 16 ప్రదేశాలలో దాడులు నిర్వహించి 80 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి 1,35,800 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. చీమకుర్తి, మద్దిపాడు, పొదిలి, తర్లుపాడు, త్రిపురాంతకం, కొండపి, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, అర్ధవీడు పోలీసుస్టేషన్లలో ఒక్కో కేసు చొప్పున నమోదు చేశారు. కంభం, యర్రగొండపాలెం పోలీసు స్టేషన్లలో రెండు కేసుల చొప్పున నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా సరే పేకాట, మట్కా, కోడిపందేలకు పాల్పడితే వదిలిపెట్టేదిలేదని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.