
టీడీపీ నాయకుడి దౌర్జన్యంపై బాధితుల నిరసన
ఒంగోలు వన్‌టౌన్: ఒంగోలు నెహ్రూకాలనీలో గత 20 సంవత్సరాలుగా తాము నివాసం ఉంటున్న గృహాన్ని కూలగొడతామని టీడీపీ నాయకుడు పసుపులేటి శ్రీను బెదిరిస్తున్నాడంటూ శనివారం బాధితులు నిరసన వ్యక్తం చేశారు. దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ మాల కులానికి చెందిన ఈద జాస్మిన్, విజయల కుటుంబం నెహ్రూకాలనీలో గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో నివాసం ఏర్పాటు చేసుకుని ఇంటి పన్ను, కుళాయి పన్నులను ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటోందని తెలిపారు. అయితే, అదే ప్రాంతానికి చెందిన బిల్డర్ అపార్టుమెంటు కట్టేందుకు ప్రయత్నిస్తూ వీరి కుటుంబానికి చెందిన గృహాన్ని కూలగొట్టేందుకు మున్సిపల్ అధికారులతో కలిసి కుట్రలు చేస్తున్నాడన్నారు. టీడీపీ నాయకుడు పసుపులేటి శ్రీను, మున్సిపల్ అధికారులు కూడా బాధితులను బెదిరిస్తున్నారన్నారు. దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ డీఆర్‌ఓ ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో కె.జయకుమార్, ఎస్‌కే జిలానీ, సీహెచ్ సంపత్ కుమార్, బాధితులు పాల్గొన్నారు.