
గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా శిద్దా సుధీర
చీమకుర్తి: చీమకుర్తిలోని గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా గోల్డెన్ గ్రానైట్ ఎండీ శిద్దా సుధీర్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. రెండు రోజుల క్రితం ఒంగోలులోని గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ గెస్ట్ హౌస్‌లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్–1గా శిద్దా భరత్, వైస్ ప్రెసిడెంట్–2గా శిల్పారెడ్డి, వైస్ ప్రెసిడెంట్–3గా ఆనంద్ శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా రవిచంద్రన్, జాయింట్ సెక్రటరీ–1గా భాస్కర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ–2గా నవీన్‌రెడ్డి, ట్రెజరర్‌గా చలువాది బదరీనారాయణను ఎన్నుకున్నారు. వారితో పాటు మరో 9 మంది గ్రానైట్ యజమానులను ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నుకున్నారు.
ఒంగోలు టాస్క్‌ఫోర్స్: ప్రభుత్వ పాఠశాలల్లో ఎటువంటి ప్రైవేటు అసోసియేషన్లకు సంబంధించిన ఆటల పోటీలు, ఎంపికలు, సమావేశాలు నిర్వహించరాదని, అలాంటి కార్యక్రమాలకు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు అనుమతులు ఇవ్వరాదని డీఈవో ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అయితే, ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ టంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శుక్రవారం ఏపీ సాఫ్ట్‌బాల్ ఆర్గనైజింగ్ అసోసియేషన్ వారికి పురుషులు, సబ్ జూనియర్స్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమానికి అనుమతివ్వడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అసోసియేషన్ సభ్యులు, వ్యాయామ పీడీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎలాగైతేనేమీ అధికార పార్టీ నాయకుల అండదండలతో సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక కార్యక్రమం పూర్తయింది. దీనిపై ప్రైవేటు అసోసియేషన్ ఆటల పోటీలకు అనుమతులు ఎలా ఇస్తారని వ్యాయాయ పీడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఏపీ సాఫ్ట్‌బాల్ ఆర్గనైజింగ్ అసోసియేషన్ వివాదాల్లో కోర్టులో ఉందని, అంతేగాకుండా అవకతవకలకు పాల్పడుతోందని అన్నారు. దీనిపై డీఈవోకు ఫిర్యాదు చేస్తామని పీడీలు తెలిపారు. దీనిపై డీఈవోను ఫోన్‌లో టంగుటూరు ఎంఈఓ సంప్రదించబోగా.. ఆయన అందుబాటులోకి రాలేదని తెలిసింది.
ఒంగోలు సబర్బన్: కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ నిర్మాణానికి భూమి సిద్ధంగా ఉందని కలెక్టర్ పీ రాజాబాబు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ దృష్టికి తీసుకెళ్లారు. సీబీజీ ప్లాంట్ నిర్మాణంపై నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ విజయానంద్ శుక్రవారం రాజధాని అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీబీజీ ప్లాంట్‌కి జిల్లాలో 4,993 ఎకరాల భూమి ఎంపిక చేశామని కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో భూ సేకరణ పూర్తయిందన్నారు. కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి భూమి సమస్య ఏమీ లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే నెట్ క్యాప్, రిలయన్స్ సంస్థ సంయుక్తంగా ప్రకాశం జిల్లాలో సోలార్ పార్క్ నిర్మించనుందన్నారు. సోలార్ పార్క్ నిర్మాణానికి 90 వేల ఎకరాలు అవసరమని ప్రభుత్వం నుంచి అధికారికంగా లేఖలు అందాయన్నారు. ఇందు కోసం ప్రస్తుతం 55 వేల ఎకరాల భూమిని గుర్తించామని సీఎస్ కి వివరించారు.

గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా శిద్దా సుధీర