
రుణాల లక్ష్యాలు అమలు చేయాలి
ఒంగోలు సబర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి కేటాయించిన రుణాల లక్ష్యాలను కచ్చితంగా చేరుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేటాయించిన రుణ లక్ష్యాలు సాధించడంతో పాటు జిల్లాలో ఉపాధి కల్పన యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతి గురించి ఆయా బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఉపాధి కల్పన యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా పీఎంఈజీపీ, ముద్ర, పీఎం విశ్వకర్మ, తదితర కేంద్ర, రాష్ట్ర పథకాలకు సంబంధించిన రుణాల లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు, బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో లీడ్ జిల్లా మేనేజర్ రమేష్, డీఆర్డీఏ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు నారాయణ, శ్రీహరి, వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, రవికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్‌నాయక్, సీపీడీసీఎల్ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వరరావు, జిల్లా హార్టీకల్చర్ అధికారి గోపీచంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకు కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో కలెక్టర్ రాజాబాబు