
ఒక ఓటు హక్కు మాత్రమే కలిగి ఉండాలి
ఒంగోలు సబర్బన్: ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఓటరూ ఒక ఓటు మాత్రమే కలిగి ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) బి.చిన ఓబులేసు స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్వో చాంబర్‌లో ఎన్నికల అధికారులతో కలిసి జిల్లాలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ తప్పులు లేని ఓటరు జాబితా తయారీ, పోలింగ్ శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, 18–19 ఏళ్ల వయసు గల యువతకు ఓటు నమోదు వంటి అంశాలపై సలహాలు, సూచనలు అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. రెండేసి ఓట్లు కలిగిన వారు వెంటనే ఒక ఓటును రద్దు చేసుకుని నివాసం ఉన్న చోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలని ఓటర్లకు డీఆర్వో విజ్ఞప్తి చేశారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోనివారంతా వెంటనే ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఒంగోలు నగరం, జిల్లాలోని పట్టణాల్లో డోర్ నంబర్లు లేకుంటే డోర్ నంబర్లు వేసేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. జిల్లాలో చనిపోయిన వారి ఓట్లను వెంటనే ఓటరు లిస్టు నుంచి తొలగించాలని సూచించారు. సమావేశంలో ఒంగోలు, కనిగిరి ఆర్డీవోలు కళావతి, కేశవర్దనరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, ఏ కుమార్, వరకుమార్, సత్యనారాయణ, రవీంద్రారెడ్డి, జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు వైఎస్సార్ సీపీ నుంచి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు వెంకటరావు, ఓ సైదా, ఓ రసూల్, గుర్రం సత్యం, రఘురామ్, సుదర్శన్, జిల్లా ఎలక్షన్ సెల్ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలి
రాజకీయ పార్టీల ప్రతినిధుల
సమావేశంలో డీఆర్వో ఓబులేసు