ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండానే... | - | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండానే...

Sep 26 2025 6:10 AM | Updated on Sep 26 2025 6:10 AM

ఒక్క

ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండానే...

ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండానే...

879 మంది ఉద్యోగాలకు ఊరంతా టాంటాం 43 ఆర్టీసీ బస్సుల్లో అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను వెలగపూడి సచివాలయానికి తరలింపు నిధులు ఇవ్వకపోవడంతో తలలు పట్టుకుంటున్న విద్యాశాఖాధికారులు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఉమ్మడి జిల్లాలో 7 వేల మందికి ఒకేసారి సచివాలయాల్లో ఉద్యోగాలు

293 మంది వైద్యారోగ్య కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసిన జగన్‌ ప్రభుత్వం

12 వేల మంది వలంటీర్ల నియామకం

ఉద్యోగాలిచ్చి హుందాగా వ్యవహరించిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాన్ని కూటమికి ప్రమోషన్‌గా మార్చేశారని విద్యార్థి సంఘాల మండిపాటు

చంద్రబాబు ప్రచార యావకు అంతేలేకుండా పోతోంది. చేసేది గోరంత..ప్రచారం కొండంతగా డీఎస్సీ హైడ్రామా సాగుతోంది. కేవలం 879 మందికి టీచర్‌ ఉద్యోగాలిచ్చి బాబు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. 2025 డీఎస్సీ ద్వారా ఎంపికై న ఉపాధ్యాయులకు నియామకపత్రాలు అందజేసేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి మరీ వెలగపూడి సచివాలయానికి తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 7 వేల మందికి గ్రామ, వార్డు సచివాలయాల కొలువులిచ్చి హుందాగా కాల్‌ లెటర్లు ఇంటికి పంపించింది.

పెద్దదోర్నాల: కూటమి ప్రభుత్వ తీరుతో పండుగ రోజుల్లో గమ్యస్థానాలకు చేరేందుకు బస్సులు లేక ప్రయాణికులు అవస్థపడ్డారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ 2025లో ఎంపికై న అభ్యర్థులకు నియామకపత్రాలు అందించేందుకు వారందరినీ అమరావతి తరలించే ఆర్భాటపు కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం బస్సులు తరలించింది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో డీఎస్సీ 2025లో 3,750 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిని అమరావతి తీసుకెళ్లి నియామకపత్రాలు అందించేందుకు వారితో పాటు మరో 3,750 మంది సహాయకులను సైతం తరలించేందుకు ప్రభుత్వం 150 బస్సులు కేటాయించింది. ఆయా జిల్లాల అభ్యర్థులను తీసుకొచ్చేందుకు బుధవారం బస్సులను వారి స్వస్థలాలకు పంపించారు. దీంతో అభ్యర్థులు బుధవారం ఆయా జిల్లాల నుంచి అమరావతి తరలివెళ్లారు. ఈ తతంగమంతా పూర్తయ్యే సరికి పూర్తిగా రెండు రోజుల సమయం పట్టడంతో గురువారం కూడా ప్రయాణికులకు తీవ్ర బస్సుల కొరత ఏర్పడింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి అధిక శాతం బస్సులు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వస్తుంటాయి. ఆయా రూట్లలో ఓ ఐదు ఆర్డినరీ సర్వీసులు మినహా మిగతావన్నీ సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌లే తిరుగుతుంటాయి. డీఎస్సీ అభ్యర్థుల కోసం సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌లు కేటాయించటంతో బస్సుల కొరత ఏర్పడింది. దీంతో బుధ, గురువారాలలో పెద్దదోర్నాల మండల కేంద్రం నుంచి ఽశ్రీశైలం వెళ్లేందుకు బస్సులు లేకపోవటంతో పలువులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేశారు.

గోరంత పోస్టులకు

బస్సంత డప్పు!

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సాధారణంగా ఏ ఉద్యోగ నియామకాలకై నా ఎంపికై న అభ్యర్థికి అపాయింట్మెంట్‌ ఆర్డర్‌ను రిజిస్టర్‌ పోస్టు ద్వారా ఇంటికి పంపించడం జరుగుతుంది. ఆన్‌లైన్‌ విధానం అమలులోకి వచ్చిన తరువాత ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నియామకాలకు సంబంధించిన లిస్ట్‌ పెట్టడం, నేరుగా అభ్యర్థి మొబైల్‌కు ఈ మెయిల్‌ మెసేజ్‌ పంపించడం జరుగుతోంది. కొన్ని ఉద్యోగాలకు కౌన్సెలింగ్‌ ద్వారా అపాయింట్మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వడం అనాదిగా వస్తోంది. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిన కూటమి నేతలు ఏడాదిన్నర కాలం పాటు కాలయాపన చేశారు. కూటమి ప్రభుత్వం అనేక ఆపసోపాలు పడి డీఎస్పీ నిర్వహించింది. అనేక అవకతవకలతో చివరికి ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ ఆ సందేహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎస్పీ ఉపాధ్యాయులకు నేరుగా అపాయింట్మెంట్‌ ఆర్డర్‌ను ఇంటికి పంపించకుండా కుంభమేళా తరహాలో రాష్ట్రస్థాయిలో ఎంపికై న అభ్యర్థులందరినీ వెలగపూడి సచివాలయానికి పిలిపించి మరీ నియామకపత్రాలు అందజేసే కార్యక్రమాన్ని గురువారం చేపట్టింది. ఇది విమర్శల పాలవుతోంది.

కొత్త ఉపాధ్యాయులకు ఆదిలోనే అగచాట్లు...

జిల్లా నుంచి డీఎస్సీకి ఎంపికై న వారిలో 661 మంది ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. జోనల్‌ స్థాయి ఉపాధ్యాయులు 189 మంది కలిపి మొత్తం 849 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో 591 మంది పురుషులు, 258 మంది మహిళలు ఉన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న ఉపాధ్యాయులతో పాటు వారి సహాయకులు ఒక్కొక్కరిని వెలగపూడి తరలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అంటే 849 మంది ఉద్యోగులతో పాటుగా మరో 849 మంది సహాయకులతో కలుపుకుని మొత్తం 1,698 మందిని వెలగపూడి తరలించే బాధ్యత విద్యాశాఖ అధికారుల నెత్తిమీద పడింది. జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, వారి సహాయకులు అనేక వ్యయప్రయాసలకోర్చి ఒంగోలు చేరుకోవాల్సి వచ్చింది. మహిళా అభ్యఽర్థులు బాగా ఇబ్బంది పడ్డారు. అయితే, వీరిని వెలగపూడి తరలించడానికి ఒంగోలు నుంచి 43 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రే వీరందరినీ జిల్లా కేంద్రమైన ఒంగోలు తరలించారు. వారికి రాత్రి బస ఏర్పాటు చేయడానికి అధికారులు నానా అగచాట్లు పడ్డారు. ప్రైవేటు కళాశాలల్లో వారికి ఏర్పాట్లు చేశారు. ఒంగోలులో దోమల బెడదకు ఉపాధ్యాయులు, వారికి తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులు నిద్రలేకుండా నరకం అనుభవించారు. ఏర్పాట్లను పర్యవేక్షించడానికి నలుగురు నోడల్‌ ఆఫీసర్లను నియమించారు.

ఆర్టీసీ సంగతి దేవుడెరుగు...

డీఎస్సీ నియామకపత్రాలు అందజేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా నుంచి 43 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం 16 గంటలకుగానూ 18 వేల రూపాయల అద్దెతోపాటుగా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో బస్సుకు 20 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. 43 బస్సులకుగానూ సుమారు రూ.9 లక్షల భారం జిల్లా ఆర్టీసీ మీద పడుతోంది. అయితే, దీనికి కూడా ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదని తెలుస్తోంది. ఈ ఖర్చును రీయింబర్స్‌ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నట్టు తెలిసింది. ఇటీవల అనంతపురంలో ఏర్పాటు చేసిన సూపర్‌ సిక్స్‌ సభకు జిల్లా నుంచి 300కుపైగా ఆర్టీసీ బస్సులు తరలించారు. దాని బిల్లులు ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. ఇక వెలగపూడి సభ తాలూకు బిల్లులు ఎప్పటికొస్తాయో దేవుడికే ఎరుకని ఆర్టీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. దీనికి తోడు 43 బస్సులను వెలగపూడి తరలించడంతో రెగ్యులర్‌ ప్రయాణికులు నానా అగచాట్లు పడ్డారు.

జగన్‌ ప్రభుత్వ హయాంలో ఇలా...

కూటమి ప్రభుత్వం కేవలం 849 ఉద్యోగాలిచ్చి చేస్తున్న హడావిడి చూసి కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం 849 ఉద్యోగాలకే ఇంత హడావిడి చేస్తే.. వేలాది మందికి ఉద్యోగాలిచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇక ఎంత హంగామా చేయాల్సిందోనని చెప్పుకుంటున్నారు. జగన్‌ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 7 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. వారందరికీ హుందాగా ఇంటి వద్దకే అపాయింట్మెంట్‌ ఆర్డర్‌ పంపించి గౌరవించారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు చోటివ్వకుండా నూరుశాతం పారదర్శకంగా ఉద్యోగాలకు ఎంపిక చేసి చరిత్ర సృష్టించారు. 12 వేల మంది వలంటీర్లను నియమించారు. అలాగే 2001–02లో ఎంపికై కాంట్రాక్ట్‌ బేసిక్‌ మీద పనిచేస్తున్న 29 మంది ఫార్మసిస్టులు, 26 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 123 మంది పురుష ఆరోగ్య కార్యకర్తలు, 115 మంది మహిళా ఆరోగ్య కార్యకర్తలను జగన్‌ ప్రభుత్వం పర్మినెంట్‌ చేసింది. 23 ఏళ్ల వారి కలల్ని నిజం చేశారు. అయినప్పటికీ నాటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఎలాంటి హడావిడి చేయలేదు.

పండుగ రోజుల్లో బస్సుల కొరత

ఉపాధ్యాయులకు నియామకపత్రాలు అందజేయడాన్ని ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా కూటమి ప్రభుత్వ ప్రమోషన్‌ ఈవెంట్‌గా నిర్వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లు ప్రజల సొమ్ముతో పాలకులు సొంత ప్రచారం చేసుకుంటున్నారని ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. అయితే అభ్యర్థులకు ఒంగోలులో బస, బోజన ఏర్పాట్లు చేయడానికి, ఒంగోలు నుంచి వెలగపూడి తరలించడానికి, తిరిగి ఒంగోలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం. దీంతో విద్యాశాఖ అఽధికారులు ఏం చేయాలో పాలుపోక కిందామీద పడినట్లు తెలుస్తోంది. ప్రైవేటు కళాశాలలు, యాజమాన్యాల కాళ్లు, చేతులు పట్టుకుని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అంతేగాకుండా గత నెలలో రెండు రోజుల పాటు జరిగిన అభ్యర్థుల వెరిఫికేషన్‌ ప్రక్రియకు, ఆ తర్వాత వారం పాటు చేపట్టిన రీ వెరిఫికేషన్‌ ప్రక్రియకు ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టుకోలేక, వచ్చే జీతం డబ్బు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఖరి పట్ల విద్యాశాఖ ఉద్యోగులలో అసంతృప్తి కనిపిస్తోంది.

ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండానే... 1
1/2

ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండానే...

ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండానే... 2
2/2

ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండానే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement