రోడ్డెక్కిన అధికార పార్టీ రాజకీయం | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన అధికార పార్టీ రాజకీయం

Sep 26 2025 6:10 AM | Updated on Sep 27 2025 7:29 AM

రోడ్డెక్కిన అధికార పార్టీ రాజకీయం

రోడ్డెక్కిన అధికార పార్టీ రాజకీయం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సాగర్‌ కాలువ కారుమంచి మేజర్‌ కట్టకు మరమ్మతుల విషయంలో తలెత్తిన విభేదాలతో అధికార టీడీపీలోనే రాజకీయం రాజుకుంది. చివరకు కొందరు టీడీపీ నాయకులు ఏకంగా రోడ్డెక్కి ఆందోళన బాట పట్టడం ఆ పార్టీ పాలకులు, అధికారుల అవినీతి, నిర్లక్ష్యపు పనితీరును ఎండగడుతోంది. కాలువ కట్టకు మరమ్మతుల సమస్య పరిష్కరించాలని కోరుతూ కొంతమంది రైతులతో కలిసి పేరుమోసిన టీడీపీ నాయకులు రెండు రోజుల క్రితం ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయడంతో జిల్లాలో టీడీపీ అభాసుపాలైంది. టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారుల తీరును విభేదించి రైతులతో కలిసి ఆ పార్టీకి చెందిన మార్కెటింగ్‌ కమిటీ, టీడీపీ చీమకుర్తి రూరల్‌ మండల అధ్యక్షుడు, పలు నీటి సంఘాల నాయకులు, మాజీలు, మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి, ఇతర పదవులకు పోటీపడగలిగే స్థాయి కలిగిన పలువురు నాయకులు ధర్నా చేయడం చర్చనీయాంశమైంది.

మధుకాన్‌ చుట్టూ తిరుగుతున్న టీడీపీ రాజకీయం...

సాగర్‌ కాలువ ఒంగోలు బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల్లోని దాదాపు 50 గ్రామాలకు సుమారు 130 క్యూసెక్కుల నీటిని తరలించే కారుమంచి మేజర్‌ కట్ట విరిగి దాని పక్కనే ఉన్న మధుకాన్‌ గ్రానైట్‌ క్వారీ లోయలో పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ కాలువ కట్టకు మరమ్మతులు నిర్వహించే విషయం మధుకాన్‌ గ్రానైట్‌ క్వారీ చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం టీడీపీ నాయకులు రోడ్డెక్కడానికి కూడా కారణం మధుకాన్‌ గ్రానైట్‌ క్వారీనే కావడం విశేషం. ఈ క్వారీ యజమాని నామా నాగేశ్వరరావు ఒకప్పుడు తెలంగాణలో టీడీపీకి చెందిన ఎంపీ. కాగా, రైతులకు సాగునీరు, 50 గ్రామాల ప్రజలు, పశువులకు తాగునీరు సరఫరా చేసే కారుమంచి మేజర్‌ను తిరిగి పునరుద్ధరించేందుకు డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ నుంచి కలెక్టర్‌ రూ.2.62 కోట్ల నిధులను ఈ సంవత్సరం జూన్‌ నెలలోనే మంజూరు చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సిఫార్సుల మేరకే ఆ నిధులు మంజూరైనట్లు కొందరు టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే, ఆ నిధులతో కారుమంచి మేజర్‌కు మరమ్మతులు చేయడాన్ని ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కేవలం మధుకాన్‌ గ్రానైట్‌ క్వారీ యాజమాన్యానికి మేలు చేసేందుకు అలా చేస్తున్నట్లు సమాచారం. రైతులకు అనుకూలంగా కాకుండా క్వారీ యాజమాన్యానికి మేలు చేసే విధంగా కాలువకు మరమ్మతులు చేసేందుకు ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సులతో అధికారులు అలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలా కాకుంటే అధికారులను ఎంపీ, ఎమ్మెల్యేలు ఒప్పించలేకపోతున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ధర్నా చేసిన టీడీపీ నాయకుల మాటలను నియోజకవర్గ స్థాయి నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టారా..? వారు చెప్పినా జిల్లా స్థాయి ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదా..? ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలు లేక చివరకు అధికారులు, పాలకులు, నియోజకవర్గ నాయకులు తీరుపై రైతుల పేరిట మండల స్థాయి టీడీపీ నాయకులు రోడ్డెక్కి ధర్నా చేయాల్సి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.

క్వారీ యాజమాన్యం అడ్డుపడుతోంది నిజమేనా..?

సాగర్‌ కాలువ కట్ట పునర్నిర్మాణానికి మధుకాన్‌ క్వారీ యాజమాన్యం మోకాలడ్డుతోంది నిజమేనా..? అంటే జిల్లా, రీజినల్‌ స్థాయిలోని ఇరిగేషన్‌ అధికారుల నుంచి నిజమేననే సమాధానాలు వస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్‌ గ్రానైట్‌ క్వారీ కారుమంచి మేజరు ఒడ్డున ఉంది. వాస్తవానికి గ్రానైట్‌ బఫర్‌ జోన్‌ నిబంధనలను తుంగలో తొక్కి కాలువ ఒడ్డు వరకు తవ్వటం, అదే కాలువ కట్టపై భారీ గ్రానైట్‌ రాళ్లతో ట్రాలీలు తిరగడం వలన కాలువ కట్ట బలహీనపడింది. కాలువ ఒడ్డు దాదాపు 50 మీటర్ల పొడవున విరిగి పక్కనే ఉన్న మధుకాన్‌ గ్రానైట్‌ క్వారీలో పడింది. విరిగి పడిన కాలువ కట్ట నుంచి కాలువ కిందిగా ఉన్న భూమిలో మధుకాన్‌ క్వారీ పరిధిలో కోట్లాది రూపాయల విలువ చేసే గ్రానైట్‌ నిక్షేపాలున్నాయి. కారుమంచి కాలువ కట్టను పునర్నిర్మిస్తే వాటిని తిరిగి తవ్వుకోవడానికి వీలు కాదు. ఎలాగో కారుమంచి కాలువ విరిగి క్వారీలో పడింది. ఇప్పుడు దాని ద్వారా సాగర్‌ నీటిని తరలించడం వీలు కాదు. అందుకే కారుమంచి కాలువను దూరంగా ఉన్న ఇతర భూములలో నిర్మించేందుకు అనుమతినిస్తే తామే నిర్మిస్తామంటూ మధుకాన్‌ గ్రానైట్‌ క్వారీ యాజమాన్యం ఇరిగేషన్‌ రాష్ట్ర, రీజినల్‌ స్థాయి అధికారులకు లేఖల మీద లేఖలు రాస్తోంది. దానిలో ఇరిగేషన్‌ అధికారులకు కూడా ఎంతో కొంత ఆర్థికంగా మేలు జరిగే అవకాశాలుండటంతో ఇరిగేషన్‌ అధికారులు ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. కారుమంచి కాలువ నుంచి రైతులకు గతంలో 130 క్యూసెక్కుల నీరు ప్రవహించేది. ఇప్పుడు తాత్కాలిక మరమ్మతుల పేరుతో పైపుల ద్వారా లేక టబ్‌ విధానంలో సాగర్‌ నీటిని పంపించేందుకు ఇరిగేషన్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ, ఆ విధానం ద్వారా చాలీచాలని నీరు దిగువనున్న రైతులకు సరిపోవడం లేదని, దానిని పూర్తిగా గతంలోలా 130 క్యూసెక్కుల నీరిచ్చే విధంగా నిర్మించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. దాని ఆధారంగా మధుకాన్‌ క్వారీ యాజమాన్యం కారుమంచి కాలువను పక్కకు తప్పించాలనే ఆలోచనలకు రాష్ట్రస్థాయిలో ఒకరిద్దరు అధికారులు మద్దతు తెలపటంతో దానిని అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు అనుగుణంగా కారుమంచి కాలువను పునర్నిర్మించేందుకు నియోజకవర్గ టీడీపీ నాయకులు, పాలకులు బాధ్యత తీసుకుని పనిచేయడం లేదంటూ మండల స్థాయి నాయకులు ధర్నా చేశారు. మొత్తం మీద టీడీపీ నాయకులు అధికారంలో ఉండి కూడా ధర్నా చేయటం ఆ పార్టీ పరిపాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

దీనిపై ఇరిగేషన్‌ ఉన్నతాధికారులను వివరణ కోరగా, కారుమంచి మేజర్‌ను ఇప్పుడున్న స్థానంలోనే నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాకపోతే కాలువను మళ్లీ నిర్మించేందుకు సాయిల్‌ టెస్ట్‌ చేపిస్తున్నామన్నారు. గతంలో కాలువ డిజైన్‌కు సంబంధించి పంపించిన సమాచారం లోపభూయిష్టంగా ఉండటంతో దానిని తిరిగి పూర్తి సమాచారంతో పంపించాలని జిల్లా అధికారులకు విజయవాడలోని సీఈసీడీఓ విభాగం లేఖ రాసింది. నూతనంగా తయారు చేసిన డిజైన్‌ రిపోర్ట్‌, ఇతర సమాచారం రాగానే కారుమంచి కాలువను పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేస్తున్నారు.

 

డిజైన్‌, ఫీల్డ్‌డేటాను మళ్లీ అడిగాం

కారుమంచి కాలువ నిర్మాణానికి కావాల్సిన డిజైన్‌, ఫీల్డ్‌ డేటాను మళ్లీ అడిగాం. వాటిని సీఈసీడీఓకి పంపించాల్సి ఉంటుంది. వారి నుంచి రిపోర్ట్‌ రాగానే కారుమంచి కాలువ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. కారుమంచి కాలువను తమకు ఇవ్వాలని మధుకాన్‌ గ్రానైట్‌ క్వారీ వారు ఉన్నత స్థాయి అధికారులకు లేఖలు రాసిన మాట వాస్తవమే.

– శ్యామ్‌ప్రసాద్‌, సీఈ, ఇరిగేషన్‌ డిపార్టుమెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement