
రైతుల జీవితాలతో ఆటలు..
అరకొర కేటాయింపులు..
యూరియా సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తిసింది. ఒక్క బస్తా కోసం రైతులు విలవిలలాడుతుంటే అరకొరగా వచ్చిన యూరియాను సైతం అవసరపైన ప్రాంతాలకు కేటాయించడం లేదు. అసలు జిల్లాకు ఎంత యూరియా
అవసరం..ఎంత నిల్వ ఉంది..ఎక్కడకు కేటాయించాలన్న నిర్ధిష్ట ప్రణాళిక
కరువైంది. ఫలితంగా అరకొరగా
ఉన్న యూరియా పక్కదారి పడుతోంది. అధికారుల తీరు బ్లాక్ మార్కెట్‌ను
ప్రోత్సహించాలే ఉందన్న విమర్శలు
వినిపిస్తున్నాయి.
దర్శి:
జిల్లాలో సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఈ పాటికే నార్లు పోశారు. కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా వేశారు. ఈ తరుణంలో ప్రతి రైతుకు యూరియా తప్పనిసరి. అయితే యూరియా కేటాయింపుల్లో సైతం అధికారులు పచ్చపాతం చూయిస్తున్నారు. ఫలితంగా యూరియా రైతులకు అందడం లేదు. జిల్లాకు కేటాయించిన యూరియాలో 70శాతం మార్క్‌ఫెడ్‌కు కేటాయించారు. మార్క్‌ఫెడ్ నుంచి సొసైటీలకు యూరియా సరఫరా చేస్తున్నామని చెబుతున్నారే గానీ ఆచరణలో మాత్రం ఏ సొసైటీలో కూడా యూరియా కనిపించడం లేదు. సొసైటీ నిర్వాహకులను సంప్రదిస్తే జిల్లా అధికారులు అలాట్‌మెంట్ ఇవ్వడం లేదని చెప్తున్నారు. ఈ క్రమంలో అత్యవసరంగా యూరియా అవసరమైన రైతులు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. బయట ఎరువుల దుకాణాల్లో యూరియా కొనుగోలు చేయాలంటే ఇతర ఎరువులూ కొనుగోలు చేస్తేనే ఒక బస్తా యూరియా ఇస్తామని తెగేసి చెబుతున్నారు. అది కూడా రూ.266లకు అమ్మాల్సిన యూరియాను రూ.400 నుంచి రూ.450లకు విక్రయిస్తున్నారు. యూరియా కోసం వెళితే ఇతర ఎరువులు కొనుగోలు చేయాలని బెదిరించడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఈ విధంగా ఉన్న అధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు.
సొసైటీలకు ఎరువుల కేటాయింపు ఎక్కడ..?
జిల్లాలో 91 పీఏసీఎస్‌లు, నాలుగు మల్టీస్టేట్ (ఎంఎస్‌సీఎస్)సొసైటీలు, ఐదు టుబాకో సొసైటీలు ఉన్నాయి. వీటిలో 15 పీఏసీఎస్‌లు, నాలుగు మల్టీస్టేట్ సొసైటీలు, టుబాకో సొసైటీలు రైతులకు ఎరువులు సరఫరా చేస్తున్నాయి. ఈ సొసైటీలకు మార్క్‌ఫెడ్ నుంచి నేరుగా ఎరువులు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం జిల్లా వ్యవసాయాధికారులు గత 15 రోజులుగా వారికి అనుకూలైన ఆర్‌బీకేలు, సొసైటీలకు మాత్రమే ఎరువులు కేటాయిస్తున్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతమైన దర్శి నియోజకవర్గంలో 15 సొసైటీలు ఉండగా 7 సొసైటీలకు మాత్రమే అరకొరగా ఎరువులు సరఫరా చేశారు.
పక్కదారి పట్టించేందుకే..
యూరియాను పక్కదారి పట్టించేందుకు అధికారులు కొత్త దారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలంగా ఉండే ఆర్‌బీకేలకు అధిక మొత్తంలో కేటాయించి అక్కడ నుంచి పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా సాగర్ నీరు అందుబాటులో లేని, ఎరువులు అవసరం లేని ప్రాంతాలకు యూరియా కేటాయించి అక్కడ నుండి బయట ఎరువుల దుకాణాలకు బిల్లులు లేకుండా యూరియా తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ తతంగం మొత్త జిల్లా వ్యవసాయాధికారుల కనుసన్నల్లో మండల వ్యవసాయాధికారులు నడిపిస్తున్నట్లు సమాచారం. ఇదే తరహాలో తరలించిన యూరియా జిల్లాలో అనేక ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. అన్నీ ఆర్బీకేల పరిధిలో వ్యవసాయాధికారులు పర్యవేక్షణలోనే ఈ తతంగం సాగినట్లు తెలిసింది.
జిల్లాలో యూరియా సరఫరాలో
అక్రమాలు
అవసరమైన ప్రాంతాల్లో అందుబాటులో ఉండని వైనం
అవసరం లేని ప్రాంతాలకు తరలించి బ్లాక్‌కు తరలించేందుకు పన్నాగం
అధికారుల తీరుపై అన్నదాతల ఆగ్రహం