
జల్సాలకు అలవాటు పడి చోరీలు
ఒంగోలు టౌన్: జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు స్నేహితులు ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్నారు. సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం గురువాయపాలెం గ్రామానికి చెందిన తాళ్లూరి గాబ్రియేల్, బండారు నవీన్, మరో బాలుడు ముగ్గురు స్నేహితులు. ఒకే గ్రామానికి చెందిన వీరు జల్సాలకు అలవాటుపడ్డారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు ద్విచక్రవాహనాలను చోరీ చేయడం మొదలుపెట్టారు. వీరిపై నరసరావుపేట వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో 6 మోటారు బైకులను దొంగతనాలు చేసినట్లు కేసు నమోదైంది. అదే విధంగా ఒంగోలు వన్‌టౌన్ పరిధిలో 5 బైక్‌లు, ఒంగోలు టూటౌన్ పరిధిలో మూడు, తాలుకా పోలీస్‌స్టేషన్ పరిధిలో 8 మోటార్ బైక్‌లను దొంగించిన కేసులు నమోదై ఉన్నాయి. అదే విధంగా టంగుటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, అద్దంకి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదయ్యాయి. ఈ చోరీలను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు డీఎస్పీ ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ జగదీష్, తాలుకా సీఐ టి.విజయ కృష్ణ, ఎస్సై హరిబాబు, సీసీఎస్ సిబ్బందితో రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్నీ కోణాల్లో విచారణ చేసిన పోలీసు బృందాలు గురువారం నగరంలోని నేతాజీ కాలనీ శివారు వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 19 మోటారు బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.13.50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ముగ్గురు మోటార్‌బైక్ దొంగల అరెస్టు
నిందితుల నుంచి 19 వాహనాలు స్వాధీనం