
పరిశ్రమల్లో భద్రతా చర్యలు చేపట్టాలి
ఒంగోలు సబర్బన్: పరిశ్రమల్లో భద్రత పరమైన చర్యలు తప్పక తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు పరిశ్రమల శాఖ అధికారులతో పాటు అనుబంధ విభాగాల అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో గురువారం జిల్లా పరిశ్రమల కేంద్రం, ఫ్యాక్టరీలు, కార్మిక, ఏపీఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల్లో పర్యావరణ సంబంధ నిబంధనలను కచ్చితంగా పాటించేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లాలోని వివిధ తరహా పరిశ్రమలు, వాటికి ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు, అనుమతులు మంజూరు చేస్తున్న విధానం, భద్రతా ప్రమాణాలు, కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేస్తున్న తీరుపై ఆయన ఆరా తీశారు. సంబంధిత వివరాలను ఆయా శాఖల ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ కార్మికులకు భద్రతాపరంగా విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని, ఈ దిశగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ దిశగా ఉన్న మానవ వనరులను సమర్ధంగా వినియోగించుకోవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. పరిశ్రమల్లో ఎలాంటి ప్రమాదాలు జరగరాదన్నదే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు, కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రాఘవరెడ్డి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రిదేవీ, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ మదన్, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బి. ఈశ్వర్‌చంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పరిశ్రమల అనుబంధ విభాగాల సమీక్షలో కలెక్టర్ రాజాబాబు