
పొలం తగాదాలో కత్తితో దాడి
గిద్దలూరు రూరల్: పొలం విషయంలో ఘర్షణకు దిగి భార్యభర్తలపై కత్తితో దాడి చేశారు. ఈ సంఘటన మండలంలోని ఓబులాపురంతాండాలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఇస్లావత్ బ్రహ్మానాయక్, ఇస్లావత్ హస్లీబాయ్ భార్యభర్తలు. వారిపై ప్రత్యర్థులైన కాశీనాయక్, అతని తల్లిదండ్రులు కేశాలనాయక్, లక్ష్మీబాయ్‌లు కత్తితో దాడి చేశారు. బ్రహ్మానాయక్ అనుభవంలో ఉన్న పొలం తనదంటూ కేశాలనాయక్ అతడి కుమారుడు కాశీనాయక్‌లు తప్పుడు ఆధారాలు సృష్టించి ఏడాది నుంచి ఘర్షణకు దిగుతూ కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో కాశీనాయక్ పొలంలో డ్రిప్ ఏర్పాటు చేసుకునేందుకు వెళ్లగా ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో కాశీనాయక్ కత్తితో వారిపై దాడికి పాల్పడ్డాడు. బ్రహ్మానాయక్ వర్గం వారు కూడా కాశీనాయక్‌పై దాడికి పాల్పడినట్లు తెలిసింది. గాయాలపాలైన బ్రహ్మానాయక్, హస్లీబాయ్‌లు చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.