
మార్పే లక్ష్యంగా ముందుకు..
పోలీసుల్లో జవాబుదారీతనం పెంచడమే ధ్యేయం అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం గంజాయి సంగతి తేలుస్తాం మహిళల భద్రతకు ప్రాధాన్యత మరింత విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ ప్రాపర్టీ కేసుల్లో పురోగతిపై దృష్టి ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పోలీసుల్లో జవాబుదారీతనం పెంచడమే తన లక్ష్యమని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు అన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా తిరుపతి నుంచి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇక్కడి స్థితిగతులను పరిశీలించేందుకు ఆయన పర్యటిస్తున్నారు. ఒకవైపు జిల్లా పరిస్థితిని అధ్యయనం చేస్తూనే.. మరోవైపు సామాజిక బాధ్యత దిశగా పోలీసుల్లో కదలిక తీసుకొస్తున్నారు. బుధవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడిన ఎస్పీ.. తన ప్రధాన లక్ష్యాలను వివరించారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతానని స్పష్టం చేశారు. గంజాయి కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. విజిబుల్ పోలీసింగ్‌కు కృషి చేస్తామన్నారు. పోలీసుల్లో జవాబుదారీతనం పెంచడం, అవినీతికి తావులేకుండా చేయడం తన ముందున్న లక్ష్యాలన్నారు. ప్రశాంతంగా వుండే జిల్లాగా వున్న పేరును నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు పుట్టిన గడ్డ మీద ఎస్పీగా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇదే స్ఫూర్తితో జిల్లా ప్రజలకు సేవలందిస్తానని స్పష్టం చేశారు.
ప్రజల భాగస్వామ్యంతో గంజాయి కట్టడి...
జిల్లాలో గంజాయి సాగులేదు. కానీ విశాఖ పట్టణం వైపు నుంచి భారీగా రవాణా అవుతోంది. దీనికి కారణం హైవేకు ఆనుకుని ఉండడం, విస్తృతంగా రైలు సౌకర్యం వుండడంతో గంజాయి వ్యాపారులకు సౌకర్యంగా ఉంది. ముందుగా రవాణాకు చెక్ పెడితే తరువాత దానికదే దారులు మూసుకుంటుంది. ఎప్పుడైతే గంజాయి అందుబాటులో లేకుండా పోతుందో అప్పుడు దాన్ని వాడకం కూడా తగ్గిపోతుందన్నది నా నమ్మకం. అంతటితో ఊరుకోకుండా గంజాయి వినియోగం వలన కలిగే కష్టనష్టాలను ప్రచారం చేస్తాం. విద్యార్థులు గంజాయి, ఇతర చెడు వ్యసనాల బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు అన్నీ రకాల వేదికలను ఉపయోగించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తాను. వారికి కెరీర్ మీద దృష్టి సారించే విధంగా కౌన్సెలింగ్ ఇస్తే ఉపయోగం ఉంటుంది. గంజాయి కట్టడిలో ప్రజలను భాగస్వాములను చేస్తాను. ప్రజలు భాగస్వాములు కాకుండా ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు.
బహిరంగ మద్యపానంపై కొరడా...
బహిరంగ మద్యపానం అనేది ఒక సమస్యగా నేను పరిగణిస్తున్నాను. దీని వలన సమాజంలోని వ్యక్తులు ఇబ్బందులకు గురికావడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు, బాలికలు, చిన్నారులు బాధితులవుతున్నారు అందువలన బహిరంగ మద్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాను. ఎవరైనా సరే బహిరంగంగా మద్యం సేవిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా వుంచడం జరుగుతుంది. ఇది ప్రతిఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తున్నాను.
అసాంఘిక శక్తులను వదిలిపెట్టేది లేదు...
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వదిలిపెట్టే సమస్యే లేదు. గంజాయి కావచ్చు, మద్యం కావచ్చు, అరాచకాలు, రౌడీయిజంలాంటి వాటిని ఉపేక్షించేది లేదు. ఎంతటివారైనా సరే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటా. ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోలేము కదా. శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజలకు భద్రత కల్పించడమే పోలీసు విధుల్లో ప్రధానమైన కర్తవ్యంగా నేను భావిస్తున్నాను.
మహిళల రక్షణకు ప్రాధాన్యత..
మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. మహిళలు, బాలికలు, చిన్నారుల మీద జరిగే నేరాలను అరికట్టేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా. మహిళల రక్షణకు సంబంధించిన కేసులను వెంటనే నమోదు చేయడం, సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు ప్రారంభించడం వంటి చర్యలు తీసుకుంటాం. మహిళల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చూపినా.. అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించేదిలేదు. పోలీసు అధికారులు, సిబ్బంది మహిళలు, బాలికల సమస్యలపై అప్రమత్తంగా వుండాలని సూచనలు ఇవ్వడం జరిగింది. మహిళలు ముందుకు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. పోలీసులు సకాలంలో స్పందిచపోతే నా దృష్టికి తీసుకురావాలి.
పోలీసుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కృషి..
పోలీసు ఉద్యోగం అంటేనే బాధ్యత కలిగిన ఉద్యోగం. సమాజంలో ఎక్కడేం జరిగినా ముందుగా స్పందించేది పోలీసులే. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యేది పోలీసులే. ప్రజల పట్ల పోలీసులు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో వుంది. పోలీసులంటే ఒక స్నేహితుడన్న భావన ప్రజల్లో పెంచాల్సిన బాధ్యత పోలీసుల మీదనే వుంది. పోలీసుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కృషి చేస్తా. విధులపట్ల మరింత అంకితభావంతో పనిచేసేలా చూడడం నా బాధ్యతగా భావిస్తున్నా. అలాగే, అవినీతిని అరికట్టి నిజాయితీగా విధులు నిర్వహించేందుకు కృషి చేస్తా.