
ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం ఎయిడెడ్ ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం పని చేస్తున్న 765 ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే 3 వేల మంది ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, పదోన్నతుల సమస్య, 150 మంది ఎయిడెడ్ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల సమస్య పరిష్కరించాలని, 30 వేల మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో సమానంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరారు.
చీమకుర్తి రూరల్: గ్రానైట్, ఇతర క్వారీల నుంచి వచ్చే నెల 1వ తేదీ నుంచి సీనరేజ్ వసూలు చేయడానికి ఏఎంఆర్ సంస్థ రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా చీమకుర్తి, రామతీర్థం పరిధిలో పలు ప్రాంతాల్లో ఏఎంఆర్ సంస్థ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ ఇతర క్వారీల నుంచి సీనరేజ్ వసూలు చేసే కాంట్రాక్టు కోసం ప్రభుత్వానికి రెండేళ్లలో రూ.1136 కోట్లు చెల్లించేలా ఏఎంఆర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల రామతీర్ధం వీటీసీ సెంటర్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రానైట్ ఫ్యాక్టరీల అసోసియేషన్‌ల అధ్యక్షులు, గ్రానైట్ ప్యాక్టరీ యజమానులు సీనరేజ్ వసూలు ఏఎంఆర్ సంస్థకు అప్పగించడం పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. సీనరేజ్ వసూల పై విధి విధానాలు ముందుగా గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులతో చర్చించకపోతే అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్యాక్టరీలు మూసివేస్తామన్నారు. ఏఎంఆర్ సంస్థ మాత్రం ఇప్పటి వరకు సీనరేజ్ వసూలుపై గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులతో చర్చించకుండా తనపని తను చేసుకుంటూ పోతోంది.
ఒంగోలు టౌన్: జిల్లాలో అర్ధరాత్రి భూమి కంపించింది. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిద్రలో పెద్ద శబ్దాలు వినిపించడంతో ఏమైందో అర్థంకాక ఇంటి నుంచి బయటకు పరుగులు దీశారు. ఒంగోలు నగరంలోని ఇస్లాంపేట, గోపాల్‌నగర్, కమ్మపాలెం, నీలంపాలెం, బండ్లమిట్ట, గాంధీరోడ్డు, బలరాం కాలనీ, కేశవరాజుకుంట, బిలాల్ నగర్, సిఎస్‌ఆర్ శర్మ కాలేజీ, దేవుడి చెరువు, సంతపేట, రాంనగర్ తదితర ప్రాంతాలలో అర్దరాత్రి 2 గంటల సమయంలో కంపించింది. దీని ప్రభావంతో ఇళ్లలోని వస్తువులు శబ్దం చేస్తూ కిందకు పడిపోయాయి. మంచం లాగేసినట్లు కదిలిపోయిందని ఇస్లాంపేట ప్రజలు చెప్పుకుంటున్నారు. శర్మ కాలేజీ సమీపంలో ఒక మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చి పరిశీలించడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు భూకంపం అధ్యయన కేంద్రం అధికారులు తెలిపారు. ఒంగోలుతో పాటుగా సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులప్పలపాడు, చీమకుర్తి, దర్శి, మార్కాపురం, పొదిలి తదితర ప్రాంతాలలో కూడా భూ ప్రకంపనలు కనిపించినట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు.