రక్తమోడుతున్న రహదారులు
10 నెలల కాలంలో 8 రోడ్డు ప్రమాదాలు
ఏడుగురు మృత్యువాత, మరో 10 మందికి గాయాలు
ప్రమాదాల నివారణ చర్యల్లో అధికారుల విఫలం
నల్లమల అభయారణ్య పరిధిలో రహదారులు రక్తమోడుతున్నాయి. అతివేగం, నిద్రమత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపటం ఇలాంటి కారణాలతో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే ప్రమాదాల నివారణకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదు. గత 10 నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడగా పదుల సంఖ్యలో గాయాలయ్యాయి.
పెద్దదోర్నాల: మండల పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కర్నూల్–గుంటూరు రోడ్లతో పాటు, శ్రీశైలం ఘాట్ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధిక వేగం, నిద్రలేమి, అనుభవరాహిత్యంతో పాటు మద్యం మత్తు, పలు కారణాలతో పాటు, ఘాట్ రోడ్లలోని కొన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయటంలో అధికారుల నిర్లక్ష్యం, బోర్డులు ఏర్పాటు చేసినా చెట్లకొమ్మలు పెరిగి అవి పొదలమాటున ఉండటం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఆరు ప్రమాదాలు.. ఏడుగురు మృతులు
గత ఏడాది నవంబర్ నుంచి 10 నెలల కాలంలో 6 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక స్వల్ప గాయాలతో బయటపడిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు, కర్నూల్, గుంటూరు ప్రధాన రహదారుల్లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదాలు రహదారులు సరిగా లేక పోవటంతో పాటు, వాహనాల అతి వేగం వల్లే జరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
● కర్నూలు– గుంటూరు రోడ్డులోని వెలిగొండ ప్రాజెక్టు వద్ద గత ఏడాది నవంబర్ 19న లారీ ఢీకొన్న సంఘటనలో ఓ చిన్నారి సహా మహిళ దుర్మరణం పాలవ్వగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
● ఏప్రిల్ 4న కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిలో గంటవానిపల్లె సమీపంలో మోటార్ సైకిల్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
● ఆగస్టు 19న మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్‌రోడ్డులో చిన్నారుట్ల సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడగా వ్యక్తి మృతి చెందాడు.
● ఆగస్టు 9న మండల పరిధిలోని ఐనముక్కల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ నుంచి జారిపడి వృద్ధురాలు మృతి చెందింది.
● సెప్టెంబర్ 12న కర్నూలు–గుంటూరు జాతీయ రహదారిపై కొర్రపోలు ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
● సెప్టెంబర్ 17న బైక్‌పై వెళుతున్న ఓ గిరిజనుడిని అడవి పందులు ఢీకొనడంతో బోల్తా పడి దుర్మరణం పాలయ్యాడు. అదే రోజు బైక్ అదుపుతప్పి బోల్తా పడగా తీవ్రంగా గాయపడిన వ్యక్తి కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
● సెప్టెంబర్ 18న వేగంగా ప్రయాణిస్తున్న కారు టైర్ బస్ట్ కావడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ సంఘటన మండల పరిధిలో శ్రీశైలం రహదారిలోని ఈద్గా వద్ద జరిగింది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.