
ఈ–పంట త్వరితగతిన నమోదు చేయాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఈ–పంట నమోదు త్వరితగతిన నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వ్యవసాయ అధికారులకు, సహాయ వ్యవసాయ సంచాలకులకు ఈ–పంట నమోదుపై కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటికి జిల్లాలో మొత్తం 15,68,517 భూ కమతాలకు గాను 4,63,071 భూ కమతాలు మాత్రమే అంటే 30 శాతం నమోదు చేశారన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ లోపల నమోదు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారులందరూ గ్రామ వ్యవసాయ సహాయకులకు రోజుకు 100 కమతాలు చొప్పున లక్ష్యంగా నిర్దేశించి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలేమైనా ఉంటే వెంటనే సవరించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాసరావును ఆదేశించారు. జిల్లా సరాసరి కన్నా తక్కువగా నమోదు చేసిన వ్యవసాయ అధికారులను చేయకపోవటానికి కారణాలను చెప్పమని కోరారు. సహాయ వ్యవసాయ సంచాలకులను మీ పరిధిలోని మండలాలను లక్ష్యంగా పెట్టుకొని పూర్తిచేసేట్టుగా పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా ఉద్యాన శాఖాధికారి గోపీచంద్, ఉద్యానవన శాఖ అధికారులు గ్రామ సహాయకులు చేసిన రికార్డ్స్‌ను ఆమోదించటంలో వెనకబడి ఉన్నారని, త్వరగా చేయాలని ఆదేశించారు. జియో ఫెన్సింగ్ 20 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచితే బీడు కమతాలను తొందరగా పూర్తిచేయవచ్చని, అదే విధంగా చివరి తేదీ అక్టోబర్ 15 వరకు పొడిగించాలన్న విషయాలను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకువెళతానని జేసీ చెప్పారు. బ్లాక్ బుర్లీ పొగాకు సాగును కట్టడి చేయాలని ఆదేశించారు. యూరియా అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా అధికారి వి. సుభాషిణి, జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయ సాంకేతిక అధికారులు పాల్గొన్నారు.
ఈ నెలాఖరులోగా నమోదు పూర్తి చేయాలి
వ్యవసాయ శాఖ అధికారులతో
సమీక్షలో జేసీ గోపాలకృష్ణ