
ఓబులక్కపల్లిలో పట్టపగలే చోరీ
● రూ. 4 లక్షల విలువైన సొత్తు అపహరణ
పెద్దారవీడు: మండలంలో ఓబులక్కపల్లి గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన దుగ్గెంపూడి మల్లారెడ్డి కుటుంబసభ్యులు పొగాకు నారు వేసుకునేందుకు ఉదయం పొలానికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వచ్చారు. అ సమయంలో ఇంటి తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోకి వచ్చి చూడగా ఇళ్లంతా దుస్తులు, వంటపాత్రలు, బియ్యం బస్తాలు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో భయంతో చుట్టుపక్కల వారికి విషయం తెలియజేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి పరిశీలించగా బీరువాలోని రూ.40 వేల నగదు, బంగారు కమ్మలు, బుట్టలు, ఉంగరాలు, నల్లపూసల దండా అపహరణకు గురైనట్లు గుర్తించారు. వాటి విలువ రూ.3.60 లక్షలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. రెండు రోజుల నుండి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారని, వారే దొంగతనానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు.