ఎమ్మెల్యే అరాచకాలపై ధర్నాకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అరాచకాలపై ధర్నాకు సిద్ధం

Sep 24 2025 7:43 AM | Updated on Sep 24 2025 7:43 AM

ఎమ్మెల్యే అరాచకాలపై ధర్నాకు సిద్ధం

ఎమ్మెల్యే అరాచకాలపై ధర్నాకు సిద్ధం

వెలుగొండ, మెడికల్‌ కాలేజి, జిల్లా కేంద్రం ఏర్పాటుపై చర్చకు సిద్ధం కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ప్రజలు చెప్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

మార్కాపురం టౌన్‌: మార్కాపురం ఎమ్మెల్యే అరాచకాలపై త్వరలో ఒంగోలులో ధర్నా చేస్తామని, వెలుగొండ ప్రాజెక్టు, మెడికల్‌ కాలేజి, జిల్లా కేంద్రంగా మార్కాపురం ఏర్పాటుపై ఎవరితోనైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని తేదీ, సమయం, స్థలం చెపితే చాలని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ అన్నా రాంబాబు అన్నారు. మంగళవారం పట్టణంలోని వైఎస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 19న పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాయవరం వద్ద ఉన్న మెడికల్‌ కాలేజి వద్ద పీపీపీ వద్దు, ప్రభుత్వం మెడికల్‌ కాలేజిని నడపాలని నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇందుకు కౌంటర్‌గా 21న మార్కాపురం ఎమ్మెల్యే సమావేశం నిర్వహించి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంటే వైఎస్సార్‌ సీపీ వాళ్లు అడ్డుకుంటున్నారని వాడు, వీడు అని నోరుపారేసుకుని మాట్లాడారన్నారు. అధికారం ఉందని నోరు పారేసుకోవద్దని, మాకు నోరుంది మేము అనలేక కాదు మాకు సభ్యత ఉందికాబట్టే మాట్లాడటం లేదన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీలను తెచ్చిందని, 2023లో 5 కాలేజీలను ప్రారంభించారన్నారు. గత సంవత్సరం 2 కాలేజీలు పూర్తయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అడ్మిషన్‌లు చేయకుండా అనాసక్తత చూపుతూ నిలుపుదల చేశారన్నారు. మెడికల్‌ కాలేజీని ప్రభుత్వం నిర్వహిస్తే పేద విద్యార్థులకు ఉపయోగమా, ప్రైవేటు యాజమాన్యం నిర్వహిస్తే ఉపయోగమా అనేది ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. పీపీపీ విధానంలో కేవలం 33 ఏళ్లు మాత్రమే నిర్వహిస్తారని, అనంతరం ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పటం ప్రజలకు అర్థం కాదా అని ప్రశ్నించారు. కాలేజీని నిబంధనల ప్రకారం 66 సంవత్సరాలు పీపీపీ విధానం కింద ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని కూటమి ఎమ్మెల్యే తెలుసుకోవాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టుపై ఏ ప్రభుత్వ కాలంలో ఎంత ఖర్చు పెట్టింది కాగ్‌ నివేదికలు పేర్కొంటున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని ప్రజలు చెప్తే బేషరతుగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఈ నియోజకవర్గంలో గత 15 నెలలుగా ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, మద్యం దోపిడీ, బియ్యం దోపిడీ, ల్యాండ్‌ దోపిడీలు జరుగుతుంటే మీరెందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. మార్కాపురం నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, మీరు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించండన్నారు. అంతే కానీ నోరుందని పారేసుకుంటే ఫలితం ఉండదన్నారు. కార్యక్రమంలో ఏపీ మైనార్టీ కార్పొరేషన్‌ బోర్డు మాజీ చైర్మన్‌ డాక్టర్‌ మీర్జా షంషీర్‌ అలీబేగ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల కృష్ణ, ఎంపీపీ బండి లక్ష్మీదేవి కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ జీ.శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్‌లు డాక్టర్‌ కనకదుర్గ, ఎం.శ్రీనివాసులు, సలీం, చంద్ర, తర్లుపాడు మండల పార్టీ అధ్యక్షుడు మురారి వెంకటేశ్వర్లు, డాక్టర్‌ మగ్బుల్‌బాషా, నజీర్‌, నాయకులు పీ.చెంచిరెడ్డి, జీ.సత్యనారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, గుంటక చెన్నారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌, నాలీ కొండయ్య యాదవ్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement